Telugu Gateway
Telangana

టీఆర్ఎస్ కు రూల్స్ వ‌ర్తించ‌వా?!

టీఆర్ఎస్ కు రూల్స్ వ‌ర్తించ‌వా?!
X

నిబంధ‌న‌లు వాళ్లే పెడ‌తారు. వాళ్లే ఉల్లంఘిస్తారు. అదేమిటంటే జ‌రిమానా క‌డ‌తాం పోండి అని బ‌హిరంగంగానే చెబుతారు. నిబంధ‌న‌లు ఉన్న‌ది పాటించటానికా?. ఉల్లంఘించి జ‌రిమానాలు క‌ట్ట‌డానికా. పొర‌పాటున ఎవ‌రైనా రూల్స్ ఉల్లంఘిస్తే వారిపై జ‌రిమానా వేయ‌టం ఒకెత్తు. కానీ ఉద్దేశ‌పూర్వ‌కంగా ఉల్లంఘ‌న‌ల‌కు పాల్ప‌డి..జ‌రిమానా వేసుకోండి పోండి అని చెప్ప‌టం అంటే. అదీ స‌ర్కారులోని భాగ‌స్వాములు..అధికార పార్టీనే అలా చేయటం ఎంత వ‌ర‌కు స‌మంజసం. గ‌త కొంత కాలంగా అధికార టీఆర్ఎస్ ఇదే పనిచేస్తోంది. నగరంలో హోర్డింగ్‌లు, అక్రమ ఫ్లెక్సీల ఏర్పాటును నిషేధిస్తూ ఏప్రిల్‌ 20, 2020న పురపాలక శాఖ జీఓ-68 జారీ చేసింది. ఇదే అంశంపై మున్సిప‌ల్ శాఖ మంత్రి కెటీఆర్ ప‌లుమార్లు బ‌హిరంగ వ్యాఖ్య‌లు కూడా చేశారు. నిబంధ‌న‌లు ఉల్లంఘించే వారిని ఏ మాత్రం స‌హించ‌కూడ‌ద‌న్నారు. అయితే ఈ రూల్స్ ప్రతిపక్ష పార్టీలు..ఇత‌ర వాణిజ్య సంస్థ‌ల‌కు మాత్రం ఆగ‌మేఘాల మీద‌ వ‌ర్తిస్తాయి.

ఇత‌రులు ఎవ‌రైనా ఫ్లెక్సీలు..తోర‌ణాలు క‌డితే మాత్రం జీహెచ్ ఎంసీకి చెందిన ప్ర‌త్యేక టీమ్ లు రంగంలోకి దిగి వాటిని వెంట‌నే తొల‌గిస్తాయి. కానీ అధికార టీఆర్ఎస్ కు మాత్రం చాలా మిన‌హాయింపులు ఉంటాయి. అస‌లు జీహెచ్ఎంసీ టీమ్ లు అటువైపు క‌న్నెత్తి కూడా చూడ‌వు. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ వ్య‌వ‌స్థాప‌క దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకుని కూడా న‌గ‌రమంతా హోర్డింగ్ లు..గులాబీ తోర‌ణాల‌తో నింపేశారు. నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘించి మ‌రీ హోర్డింగ్ లు పెట్టారు. ఇందులో ఏకంగా మంత్రులు..ఎమ్మెల్యేల‌వే ఎక్కువ ఉండ‌టం విశేషం. గ‌త ఏడాది టీఆర్ఎస్ ప్లీన‌రీ స‌మ‌యంలోనూ టీఆర్ఎస్ నేత‌లు ఇలాగే చేశారు. జీహెచ్ఎంసీ కూడా ఉద్దేశ‌పూర్వ‌కంగా వ‌దిలేసి ఏదో జ‌రిమానాతో స‌రిపెట్టింది. మ‌ళ్లీ ఇప్పుడు టీఆర్ఎస్ వ్య‌వ‌స్థాప‌క దినోత్స‌వం సంద‌ర్భంగా సేమ్ సీన్ రిపీట్ అయింది.

Next Story
Share it