Telugu Gateway
Telangana

అదే కొంప ముంచింది అంటున్న వైసీపీ నేతలు

అదే  కొంప ముంచింది అంటున్న వైసీపీ నేతలు
X

realisationప్రజలు అధికారం ఇచ్చేది పాలించటానికి. కానీ గెలిచిన వాళ్ళు అందరూ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం అంతా ఇక తమ ప్రైవేట్ ప్రాపర్టీ అన్న చందంగా వ్యవహరిస్తూ పోయారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ ఓటమికి..మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓటమికి ఇదే ప్రధాన కారణం అన్న విషయం తెలిసిందే. ఇంత జరిగిన తర్వాత కూడా బిఆర్ఎస్ వర్కింగ్ కెటిఆర్ కు క్లారిటీ వచ్చినట్లు లేదు. తాజాగా ఆయన ఢిల్లీ లో చేసిన వ్యాఖ్యలు బిఆర్ఎస్ వర్గాలను కూడా ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఆంధ్ర ప్రదేశ్ లోని జగన్ సర్కారు పై ప్రజలు ఎంత కసితో ఉంటే గత ఎన్నికల్లో 151 సీట్లు గెలిచిన పార్టీని కేవలం 11 సీట్లకు పరిమితం చేశారో గుర్తించకుండా ఆంధ్ర ప్రదేశ్ ఫలితాలు ఆశ్చర్యకరంగా ఉన్నాయని కేటీఆర్ వ్యాఖ్యానించారు అంటే ఇటు తెలంగాణ, అటు ఆంధ్ర ప్రదేశ్ ఫలితాలు చూసిన తర్వాత కూడా వీళ్ళు ఏ మాత్రం వాస్తవాన్ని గ్రహించటం లేదు అనే చర్చ సాగుతోంది. ఇక్కడ మరో కీలక విషయం ఏమిటి అంటే మొన్నటి ఎన్నికల్లో జగన్ దారుణ ఓటమికి ప్రధాన కారణాల్లో ఒకటి జగన్ కూడా కెసిఆర్ మోడల్ ను ఫాలో అవటం అనే అభిప్రాయం వైసీపీ కీలక నేతల్లో ఉంది. మరి ఈ విషయం కేటీఆర్ కు తెలియదా?. అచ్చం కెసిఆర్ తరహాలోనే జగన్ కూడా మంత్రులు, ఎమ్మెల్యేలను ఏ మాత్రం లెక్క చేయకుండా సర్వం తానే అన్నట్లు వ్యవహరించారు. అటు కెసిఆర్, ఇటు జగన్ లు పార్టీలను ప్రైవేట్ కంపెనీల తరహాలో నడిపే ఇప్పుడు ఫలితం అనుభవిస్తున్నారు అని వైసీపీ కీలక నేత ఒకరు వ్యాఖ్యానించారు.

అధికారంలో ఉన్నప్పుడు ఇదే కేటీఆర్ ఆంధ్ర ప్రదేశ్ లో రోడ్లు ఎలా ఉన్నాయో చూడండి..మీకు ఆంధ్ర ప్రదేశ్ కు, తెలంగాణకు మధ్య తేడా తెలుస్తుంది అని బహిరంగంగా చెప్పారు. మరో మాజీ మంత్రి హరీష్ రావు ఆంధ్ర ప్రదేశ్ లోని జగన్ సర్కారు మోడీ కి సరెండర్ అయి రైతుల మోటార్లకు మీటర్లు పెట్టింది అని విమర్శించారు. రాష్ట్ర విభజన జరిగితే తెలంగాణాలో భూముల ధరలు తగ్గుతాయి అని ప్రచారం చేశారు అని..కానీ అందుకు బిన్నంగా ఇప్పుడు తెలంగాణాలో ధరలు ఎలా ఉన్నాయి...ఆంధ్ర ప్రదేశ్ లో భూముల ధరలు ఎలా ఉన్నాయి అంటూ బిఆర్ఎస్ అగ్రనేతలు అందరూ జగన్ పాలనను అధికారంలో ఉన్న కాలంలో ఎద్దేవా చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు అవన్నీ మర్చిపోయి కేటీఆర్ ఎంతో సంక్షేమం చేసినా కూడా ఓడిపోయారు అంటూ ఇప్పుడు కొత్త కొత్త థీరీలను తెరమీదకు తెస్తున్నారు. దేశం అంతా కెసిఆర్ పాలన కోరుకుంటున్నారు...తెలంగాణ మోడల్ దేశానికే ఆదర్శంగా మారింది అని అధికారంలో ఉన్నంత కాలం చెప్పుకున్న కేటీఆర్ ఇప్పుడు మాత్రం తాము ఏ కూటమిలో లేనందువల్ల దెబ్బతిన్నామని చెప్పటం విశేషం. ఇప్పటికి కేటీఆర్ తమ వైపు జరిగిన తప్పులను ఏ మాత్రం గ్రహించకుండా...ప్రజల దృష్టి మళ్లించటానికి కొత్త థీరీలు ప్రచారంలో పెడుతున్నారు అని సొంత పార్టీ నాయకులే అభిప్రాయపడుతున్నారు.

Next Story
Share it