తెలంగాణ లో విద్యుత్ సంక్షోభం ఉండదు
అకస్మాత్తుగా దేశాన్ని విద్యుత్ సమస్య వెంటాడుతోంది. దీనికి ప్రధాన కారణం బొగ్గు నిల్వలు సరిపడినన్ని లేకపోవటమే. దేశంలోని పలు రాష్ట్రాలు తమ థర్మల్ యూనిట్లను స్థాపిత సామర్ధ్యం కంటే అతి తక్కువ కెపాసిటితో నడుపుతున్నాయి. కావాల్సినంత బొగ్గు లేదని చెబుతున్నాయి. కేంద్రం మాత్రం అలాంటిది ఏమీలేదని..బొగ్గు నిల్వలు సరిపడా ఉన్నాయని వాదిస్తోంది. అయితే దీనిపై కేంద్రం కూడా అప్రమత్తం అయి చర్యలు ప్రారంభించింది. నిల్వలు సరిపడినన్ని ఉన్నాయని..ఇబ్బంది ఏమీ ఉండదు అంటుంటే....కోవిడ్ సమయంలో ఆక్సిజన్ నిల్వలలపై కూడా ఇలాగే చెప్పారని డిల్లీలోని ఆప్ సర్కారు కౌంటర్ ఎటాక్ ఇచ్చింది.
ఈ తరుణంలో తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. తెలంగాణ లో విద్యుత్ సంక్షోభం ఉండదన్నారు. రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం ఏర్పడితే అది కేంద్ర ప్రభుత్వానిదే బాధ్యత అవుతుందన్నారు. దేశ వ్యాప్తంగా బొగ్గు నిల్వలపై నీలి నీడలు కమ్ముకున్నాయని మంత్రి తెలిపారు. కేంద్రం తన నిర్ణయాలతో విద్యుత్ రంగాన్ని పూర్తిగా ప్రైవేట్ పరం చేయాలనే కుట్ర జరుగుతుందని ఆరోపించారు. కేంద్రం విద్యుత్ రంగంలో పలు సంస్కరణలకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. వ్యవసాయ బోర్లకు మోటార్లు బిగిస్తేనే రుణాలకు అనుమతి ఇస్తామని షరతులు పెట్టింది.