అయినా కలిస్తే తప్పేంటి!

బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన మంత్రి నారా లోకేష్ తో భేటీ అంశంపై స్పందించారు. కేటీఆర్, నారా లోకేష్ లతో మూడు సార్లు రహస్యంగా జరిపిన చర్చలు ఏంటి అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల ఢిల్లీ లో మీడియా తో నిర్వహించిన చిట్ చాట్ లో ప్రశ్నించిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు ఈ అంశంపై అటు లోకేష్, ఇటు కేటీఆర్ లు స్పందించకపోవటంతో దీనిపై పలు అనుమానాలు వ్యక్తం అయ్యాయి. అయితే కేటీఆర్ మాత్రం తాను ఏపీ మంత్రి లోకేష్‌ను కలవలేదు అన్నారు. అయినా లోకేష్ ను కలిస్తే తప్పేంటి? అని ప్రశించారు. లోకేష్‌తో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని.. లోకేష్‌ను అర్ధరాత్రి కలవాల్సిన అవసరం తనకు లేదని అన్నారు. రేవంత్ ప్రెస్‌మీట్‌కు యువత దూరంగా ఉండాలను సూచించారు.
రేవంత్‌రెడ్డి మానసిక రుగ్మతతో బాధపడుతున్నారని... చిట్‌చాట్‌లో చిల్లర మాటలు మాట్లాడుతున్నారని అన్నారు. బనకచర్లపై చంద్రబాబును కలవబోనని చెప్పి.. ఢిల్లీలో కలిసి దొరికారని అన్నారు. గోదావరి జలాలను చంద్రబాబుకు అప్పజెప్పి తెలంగాణకు ద్రోహం చేశారని మండిపడ్డారు. ఢిల్లీలో దొరికిన దొంగ అటెన్షన్ డైవర్షన్ కోసమే పిచ్చివాగుడు వాగుతున్నాడు అని సీఎంపై తీవ్ర విమర్శలు చేశారు. బనకచర్ల విషయంలో రేవంత్‌రెడ్డి తప్పు చేస్తే మరో ఉద్యమం తప్పదని హెచ్చరించారు. శుక్రవారం నాడు కేటీఆర్ ఖమ్మంలో పర్యటించిన ఆయన మాజీ మంత్రి పువ్వాడ అజయ్ తో కలిసి మాట్లాడారు.



