లాక్ డౌన్ విధించినా కరోనా పాజిటివ్ కేసులు తగ్గవు
అందుకే తెలంగాణలో లాక్ డౌన్ పెట్టం
సీఎం కెసీఆర్
తెలంగాణ రాష్ట్రంలో లాక్ డౌన్ విధించబోమని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. లాక్ డౌన్ విధించడం వలన ప్రజాజీవనం స్తంభించడంతో పాటు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయే ప్రమాదమున్నదని తెలిపారు. గత అనుభవాలతో పాటు ఇతర రాష్ట్రాల్లో లౌక్ డౌన్ విధించినా కూడా పాజిటివ్ కేసులు తగ్గడం లేదనే విషయాన్ని పరిశీలించిన సిఎం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారని ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. రాష్ట్రానికి కావాల్సిన వాక్సిన్లు, ఆక్సీజన్, రెమిడిసివర్ సరఫరా గురించి ప్రధాని నరేంద్రమోడితో టెలిఫోన్లో మాట్లాడి తక్షణమే రాష్ట్రానికి సమకూర్చాల్సిందిగా అభ్యర్థించారు. తమిళనాడులోని శ్రీ పెరంబదూరు నుంచి కర్నాటకలోని బల్లారి నుంచి రాష్ట్రానికి కేటాయించిన ఆక్సీజన్ అందడంలేదని ప్రధాని దృష్టికి తెచ్చారు. మెడికల్ హబ్ గా హైదరాబాద్ మారినందును సరిహద్దు రాష్ట్రాల ప్రజలు కూడా హైదరాబాద్ మీదనే వైద్యసేవలకు ఆధారపడుతున్నారని తెలిపారు. మహారాష్ట్ర, చత్తీస్ గడ్, కర్నాటక, ఆంధ్ర ప్రదేశ్ తదితర రాష్ట్రాలనుంచి హైదరాబాద్ కు కోవిడ్ చికిత్సకోసం చేరుకోవడం వలన హైదరాబాద్ మీద భారం పెరిగిపోయిందని సిఎం వివరించారు.
తెలంగాణ జనాభాకు అధనంగా 50 శాతం కరోనా పేషెంట్లు ఇతర రాష్ట్రాలనుంచి రావడం వలన హైదరాబాద్ మీద ఆక్సీజన్, వాక్సీన్, రెమిడిసివర్ వంటి మందుల లభ్యతమీద పడుతున్నదని ప్రధానికి సిఎం తెలిపారు. ఈ పరిస్థితుల్లో ప్రస్థుతం రోజుకు 440 మెట్రిక్ టన్నుల ఆక్సీజన్ మాత్రమే రాష్ట్రానికి అందుతోందని దాన్ని 500 మెట్రిక్ టన్నుల కుపెంచాల్సిందిగా ప్రధానిని కోరారు. రోజుకు తెలంగాణలో కేవలం 4900 రెమిడిసివర్లు మాత్రమే అందుతున్నాయని వాటిని రోజుకు కనీసం 25000 కు పెంచాలని కోరారు. ఇప్పటి వరకు కేంద్రం 50 లక్షల డోసులను అందచేసిందని కానీ రాష్ట్ర అవసరాల ద్రుష్ట్యా అవసరం మరింతగా వున్నదని కోరారు. రాష్ట్రానికి వాక్సీన్లు ప్రతిరోజుకు 2 నుంచి2.5 లక్షల డోసులు అవసరం పడుతున్నదని వాటిని సత్వరమే సరఫరాచేయాలని ప్రధాని మోడీని సిఎం కెసిఆర్ విజ్జప్తి చేశారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 9500 ఆక్సీజన్ బెడ్లు వున్నాయని వాటిని హైద్రాబాద్ సహా జిల్లాల్లో కలిపి మరోవారం రోజుల్లో వీటి సంఖ్యను మరో 5000 కు పెంచాలన్నారు. మెరుగైన ఆక్సీజన్ సరఫరాకోసం వొక్కోటి కోటి రూపాయల చొప్పున 12 క్రయోజనిక్ ట్యంకర్లను చైనా నుంచి వాయు మార్గంలో అత్యవసరంగా దిగుమతి చేయాలని సిఎస్ ను సిఎం ఆదేశించారు.
ఇందుకు సంబంధించి చర్యలను అత్యంత వేగంగా పూర్తిచేయాలని సిఎస్ ను సిఎం ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు కమ్యునిటీ హాస్పటల్స్ ఏరియా ఆస్పటల్స్ ల్లో మొత్తం 5980 కోవిడ్ అవుట్ పేషెంట్ సెంటర్లు ఏర్పాటుచేశామని వీటి సేవలను ప్రజలు ఉపయోగించుకోవాలని కోరారు. సెకండ్ వేవ్ లో ఇప్పటివరకు ప్రభుత్వ ప్రయివేట్ ఆసుపత్రుల్లో కలిపి లక్షాయాభైయారు వేల పాజిటివ్ కేసులు నమోదుకాగా అందులో లక్షా ముప్పయివేలు (85 శాతం) కోలుకున్నారని అధికారులు సిఎం కు వివరించారు. రోజువారిగా కరోనా పరిస్థితిపై ప్రతిరోజూ సాయంత్రం వైద్య అధికారులు రోజూ సాయంత్రం మీడియా సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించాలని సిఎం తెలిపారు. దీనికి డైరక్టర్ ఆఫ్ హెల్త్ బాధ్యత తీసుకోవాలని ఆదేశించారు. అందుకు సంబంధించి పాజిటివ్ కేసుల వివరాలు కోలుకున్న వారి వివరాలు హోం క్వారెంటైన్ లో ఎంతమంది వున్నారు ప్రభుత్వ దవాఖానాల్లో ఎంతమంది చికిత్స పొందుతున్నారు ప్రయివేట్ దవాఖానాల్లో ఎంతమంది అనే వివరాలను పబ్లిక్ డోమైన్లో ప్రదర్శించాలని ఆదేశించారు. రాష్ట్రంలో కరోనా నియంత్రణ కోసం వైద్యశాఖ తీసుకుంటున్న చర్యలను పర్యవేక్షించేందుకు ప్రత్యేక అధికారిని నియమించాలన్నారు.
వైద్య శాఖకు అవసరమైన నిధులను వెంట వెంటనే విడుదల చేయాలని ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావును సిఎం ఆదేశించారు. ఇందుకు సంబంధించి నిధుల విడుదలకు ప్రత్యేక అధికారిని నియమించాలన్నారు. మొదటి డోస్ వాక్సిన్ వేసుకున్నవాల్లకు వారి నిర్ణీత సమయాన్ని అనుసరించి రెండో డోస్ వేసేందుకు ప్రాధాన్యతనివ్వాలని సిఎం ఆదేశించారు. కరోనా విషయంలో ప్రజలు భయాందోళన గురికావద్దని సిఎం కోరారు. ఎవరికైనా ఏమాత్రం అనుమానం వచ్చినా టెస్టుల కోసం ఆందోళన చెందకుండా ముందస్తుగా ప్రభుత్వం అందించే ....కోవిడ్ మెడికల్ కిట్లను వినియోగించుకోవాలన్నారు. ఆశా వర్కర్లు ఎఎన్ఎం ల ద్వారా ఇంటింటికీ అందచేస్తామన్నారు. ఇందులో కరోనా కట్టడికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించే కరపత్రంతో పాటు మందులు అందజేస్తారని తెలిపారు.