Telugu Gateway
Telangana

తెలంగాణలో లాక్ డౌన్..కర్ఫ్యూలు ఉండవు

తెలంగాణలో లాక్ డౌన్..కర్ఫ్యూలు ఉండవు
X

మాస్క్ లు ధరించి..భౌతికదూరం పాటిస్తూ జాగ్రత్తలు పాటించాలి

కరోనా విషయంలో ప్రజలు విధిగా మాస్క్ లు ధరించటంతో పాటు భౌతికదూరం పాటిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ సూచించారు. కరోనా రెండవ దశ ఎవరూ ఊహించని స్థాయిలో విస్తరిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణలో లాక్ డౌన్, కర్ఫ్యూలు ఉండబోవని ఈటెల స్పష్టం చేశారు. తెలంగాణలో కరోనా పరిస్థితులపై మంత్రి రాజేందర్ బుధవారం నాడు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఈటెల కీలక వ్యాఖ్యలు చేశారు. 'దేశంలో 60 శాతం కేసులు మహారాష్ట్ర నుండే నమోదు అవుతున్నాయి. లక్షణాలు లేకుండానే చాలా కేసులు వస్తున్నాయి. రాపిడ్ టెస్ట్స్ అందుబాటులో కి వచ్చిన తరువాత ట్రేసింగ్ వేగవంతం అయ్యింది. దీంతో మరణాల శాతం తగ్గింది. సీఎం కెసీఆర్ ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇస్తున్నారు. 56 వేల మందికి రోజుకు వాక్సిన్ ఇస్తున్నాం.. భవిష్యత్తు లో 1.5 లక్షల మందికి ఇచ్చేందుకు ఏర్పాటు చేస్తున్నాం.

పరీక్షలు అవసరం అయితే రోజుకి లక్ష మందికి చేస్తాం. అన్ని ఆసుపత్రుల్లో సాధారణ సేవలు కొనసాగిస్తూనే కరోనా సేవలు కూడా అందిస్తాం. వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది లీవ్ లేకుండా 24 గంటలు అందుబాటులో ఉన్నాము. 33 జిల్లాల్లో ఇసోలేషన్ సెంటర్స్ ఏర్పాటు చేశాం. అన్ని జిల్లా కేంద్రాల్లో కోవిడ్ చికిత్స అందుబాటులో ఉంది. సరిహద్దు జిల్లాల వారందరూ అప్రమత్తంగా ఉండాలి. 11 వేల ఆక్సిజన్ బెడ్స్ అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వ ఆసుపత్రులకు రండి అన్ని వసతులు ఉన్నాయి. ప్రైవేట్ హాస్పిటల్ లు వ్యాపార కోణంలో చూడవద్దు. సేవ చేయండి. లక్షల రూపాయలు వసూలు చేయవద్దు. కరోనా పేషంట్ వస్తే వారి బంధువులు భయపడకుండా వచ్చి పలకరించి పోతున్నారు. భయపడకండి కానీ జాగ్రత్తలు పాటించండి. కరోనా ఒక మామూలు రోగం. వాక్సిన్ అందరికీ అందిస్తాము. హోమ్ ఐసొలేషన్ పేషంట్ కి కిట్స్ అందిస్తాము. పీహెచ్ సీ స్థాయిలో డాక్టర్ ఇంటికి ఫోన్ చేసి ఆరోగ్య పరిస్థితి తెలుకుంటారు. ఏ మాత్రం అనుమానం ఉన్న పరీక్షలు చేసుకోండి. అవసరం అయిన అన్ని మందులు అందుబాటులో ఉన్నాయి.' అని తెలిపారు.

Next Story
Share it