Telugu Gateway
Telangana

ఏపీ లో కూడా టీడీపీ, జనసేనలే !

ఏపీ లో కూడా టీడీపీ, జనసేనలే !
X

తెలంగాణ లో పొత్తు కావాలని జనసేన దగ్గరకు వెళ్ళింది బీజేపీ నేతలే. బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నంత కాలం తెలంగాణాలో ఒంటరి పోరే అని అనేక సందర్భాల్లో స్పష్టం చేశారు. బండి సంజయ్ ప్లేస్ లో కిషన్ రెడ్డి వచ్చిన తర్వాత లెక్క మారింది. కిషన్ రెడ్డి తో పాటు మరో కీలక నేత కె లక్ష్మణ్ స్వయంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దగ్గరకు వెళ్లి పొత్తుల గురించి మాట్లాడారు. తర్వాత ఢిల్లీ వెళ్లి కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో కూడా పవన్ కళ్యాణ్ పొత్తుల అంశంపై చర్చించి వచ్చారు. తర్వాత బీజేపీ తెలంగాణాలో జనసేన కు ఎనిమిది సీట్లు కేటాయించింది. ఆ పార్టీ 111 సీట్ల లో పోటీ చేసింది. అయితే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన దారుణ ఫలితాలను చవిచూసింది. ఈ ఫలితాల తర్వాత క్లారిటీ వచ్చిందో ఏమో కానీ లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుంది...ఎవరితో పొత్తులు ఉండవని తెలంగాణ బీజేపీ ప్రెసిడెంట్ కిషన్ రెడ్డి శుక్రవారం నాడు ప్రకటించారు. దీంతో తాజాగా కుదిరిన బీజేపీ, జనసేన పొత్తు ముగిసిపోయినట్లే. కిషన్ రెడ్డి తాజా ప్రకటనతో ఎన్నో అంశాలపై స్పష్టత ఇచ్చినట్లు అయింది అని కూడా చెప్పొచ్చు. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి ముందుకు సాగాలని నిర్ణయం తీసుకున్నాయి.

అయితే బీజేపీ వీళ్ళతో జత కడుతుందా లేదా అన్నది ఇప్పటివరకు స్పష్టత లేదు. తాజాగా కిషన్ రెడ్డి ప్రకటన చూస్తే ఆంధ్ర ప్రదేశ్ లో కూడా బీజేపీ, జనసేన తో కలిసి ముందుకు సాగే అవకాశం లేదు అనే అంచనాలు వెలువడుతున్నాయి. ఒక్క ప్రకటన ఎన్నో అనుమానాలకు స్పష్టత ఇచ్చినట్లు అయింది అనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. జాతీయ స్థాయిలో అండదండలు ఉంటాయనే కారణంతో టీడీపీ, జనసేనలు బీజేపీ ఓకే అంటే మాత్రం కలిసి ముందుకు సాగటానికి సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. తెలంగాణాలో జనసేనతో పొత్తును తెంచుకుని మళ్ళీ ఆంధ్ర ప్రదేశ్ లో ఆ పార్టీ ఉన్న కూటమిలో చేరే అవకాశాలు లేకపోవటంతో బీజేపీ పొత్తుకు దూరంగా ఉండే అవకాశం ఉంది అని భావిస్తున్నారు. దీంతో ఇక టీడీపీ, జనసేన లు ఉమ్మడి ప్రణాళికలు...సీట్ల షేరింగ్ తో ముందుకు సాగే అవకాశం ఉంది అని భావిస్తున్నారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణాలో అధిక సీట్లు గెలుపే లక్ష్యంగా పనిచేయనున్నట్లు కిషన్ రెడ్డి ప్రకటించారు. కేంద్రంలో మూడవసారి కూడా మోడీ సర్కారు ఏర్పాటు అవుతుంది అని అయన ధీమా వ్యక్తం చేశారు.

Next Story
Share it