Telugu Gateway
Telangana

సిరిసిల్లలో ఓడిస్తాం చూస్కో

సిరిసిల్లలో ఓడిస్తాం చూస్కో
X

తెలంగాణ మున్సిపల్ శాఖ మంత్రి కెటీఆర్ పై బిజెపి ఎంపీ ధర్మపురి అర్వింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో సిరిసిల్లలో కెటీఆర్ ను ఓడిస్తామని ఛాలెంజ్ చేశారు. అహంకారంతో వ్యవహరించటం ద్వారా అంత మూటకట్టుకున్నారని..ప్రజల్లో ఆయనపై అంత వ్యతిరేకత ఉందని తెలిపారు. ఒకప్పుడు కెసీఆర్ తో అసలు తెలంగాణ వచ్చేది కాదు..పోయేది కాదు అంటూ మాట్లాడిన వ్యక్తి ఇప్పుడు తెలంగాణ గురించి చాలా కథలు చెబుతున్నారని ఎద్దేవా చేశారు. ధర్మపురి అర్వింద్ సోమవారం నాడు బిజెపి రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న సాయం.. పన్నుల రూపంలో ప్రజలు చెల్లించిన డబ్బేనని.. కేటీఆర్ జేబులో నుంచి ఇవ్వడం లేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధుల నుంచి ఇచ్చారన్నారు. సీఎం కేసీఆర్, కేటీఆర్ సోదరి, మరో మంత్రి హరీశ్ రావు ఇలా అందరి జీతాలు ప్రజల డబ్బేనన్నారు. ప్రజల డబ్బులనే ఇస్తూ.. దాన్నే డబ్బా కొట్టుకుంటున్నారన్నారు.

కేటీఆర్ చిల్లర రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. బీజేపీ కార్యకర్తను విమర్శించే హక్కు లేదంటూ ఫైర్ అయ్యారు. కార్యకర్త ఇల్లు మునిగిందని, ఆఫీసర్లు ఇస్తే తీసుకున్నాడని, రానివారి కోసం పోరాటం చేస్తే తప్పేంటన్నారు. ''కేసీఆర్ కొడుకు కాబట్టే ఆ భాష మాట్లాడుతున్నారు. ఈయన అహంకారం ఏంటి? బీజేపీ కార్యకర్త ప్రజల కోసం కొట్లాడతారని ఇవాళ కేటీఆర్ నిరూపించారు. అభిషేక్ లాంటి కార్యకర్తను చూసి గర్విస్తున్నాం. ఖబర్దార్ కేటీఆర్. దుబ్బాకలో ఏడు చెరువుల నీళ్లు తాగించాం.

సిరిసిల్లలో నువ్వు ఓడకపోతే... నన్ను అడుగు. నువ్వు మగాడివి అయితే.. అట్లాంటి కార్యకర్తకు క్షమాపణ చెప్పాలి. ప్రస్టేషన్‌లో ఈమధ్య కేటీఆర్ ప్రెస్ మీట్లు పెడుతున్నారు. అక్రమ కట్టడాలు కూల్చడంలో గుజరాత్ సీఎంగా నరేంద్రమోదీ పనితీరును చూసి నేర్చుకో. 2 లక్షల అక్రమ కట్టడాలను కూల్చేశారు. ఎన్నికల కోసం బీజేపీ పని చేయదు. ఓవైసీ చెమ్చా గిరీ చేయడంలో అడ్మినిస్ట్రేషన్ చేశానని చెప్పుకుంటున్నారు. పాతబస్తీలో పాన్ దుకాణం తీయాలన్నా.. కేటీఆర్ ప్యాంట్ తడుస్తుంది'' అంటూ అర్వింద్ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. గతంలో అసెంబ్లీ వేదికగా కిర్లోస్కర్ కమిటీ అమలు సాధ్యం కాదని అసెంబ్లీలో చెప్పారని...ఇప్పుడు మళ్ళీ ఆ కమిటీ గురించి కొత్తగా చెబుతున్నారని విమర్శించారు.

Next Story
Share it