తెలంగాణలో రాత్రి కర్ఫ్యూ పొడిగింపు
తెలంగాణ సర్కారు మరోసారి రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూ పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా హైకోర్టు రాష్ట్రంలో వీకెండ్ లాక్ డౌన్ వంటి అంశాలను పరిశీలించాలని ప్రభుత్వానికి సూచించింది. అయితే తాజాగా సీఎం కెసీఆర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో లాక్ డౌన్ ప్రతిపాదనను నిర్ద్వందంగా తోసిపుచ్చారు. లాక్ డౌన్ వల్ల తీవ్ర సమస్యలు వస్తాయని..ఆర్ధిక వ్యవస్థ కుప్పకూలుతుందని పేర్కొన్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే రాత్రి కర్ఫ్యూనే పొడిగించారు.
ఇది మే 15 వరకూ కొనసాగనుంది. రాష్ట్రంలో సామాజిక, రాజకీయ, క్రీడా, వినోదా, విద్యా, మతపరమైన సమావేశాలు, కార్యక్రమాలపై నిషేధం కొనసాగనుందని జీవోలో పేర్కొన్నారు. రాత్రి కర్ఫ్యూ ఆదేశాలను కఠినంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించారు. ఇదిలా ఉంటే కరోనా హెల్త్ బులెటిన్ ను ఇక నుంచి సాయంత్రం విడుదల చేయనున్నట్లు వైద్య శాఖ డైరక్టర్ జి. శ్రీనివాస్ తెలిపారు. ప్రస్తుతం రోజూ ఉదయాన్నే బులెటిన్ విడుదల చేస్తూ వచ్చారు. తెలంగాణలో కొత్తగా 5,892 కరోనా కేసులు, 46 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా పాజిటివ్ కేసులు 4,81,540కు,2,625కు చేరాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 73,851 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి.