షాక్ ఇచ్చిన ఎన్ హెచ్ ఏఐ ..90 లక్షల రూపాయల జరిమానా

అమరావతి పనులు సురక్షితమేనా?!
హైదరాబాద్ కు చెందిన మేఘా ఇంజినీరింగ్ సంస్థకు వరస పెట్టి షాక్ లు తగులుతున్నాయి. కొద్ది రోజుల క్రితమే సుప్రీం కోర్టు జోక్యంతో ముంబై లో ఈ సంస్థకు దక్కిన 14000 కోట్ల రూపాయల ప్రాజెక్టులు వెనక్కిపోయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు నేషనల్ హైవేస్ అథారిటీ అఫ్ ఇండియా (ఎన్ హెచ్ ఏఐ) మరో షాక్ ఇచ్చింది. ఏడాది పాటు ఈ కంపెనీ ఎన్ హెచ్ ఏఐ బిడ్స్ లో పాల్గొనే అవకాశం లేకుండా నిషేధం విధించింది. ఈ మేరకు అధికారికంగా ప్రకటన జారీ చేసింది. దీనికి కారణం కంపెనీ చేపట్టిన ఒక జాతీయ రహదారి ప్రాజెక్ట్ లో వైఫల్యాలే. కేరళలోని ఎన్ హెచ్ 66 చెంగాల-నీలేశ్వరం సెక్షన్ లో కంపెనీ చేపట్టిన పనుల్లో వాలు కూలిపోయింది. ఈ ఘటన చోటు చేసుకున్నది ఈ జూన్ 15 వ తేదీనే. దీనికి కారణం డిజైన్ సరిగా లేకపోవటం, వాలు కూలిపోకుండా సరైన విధంగా పనులు చేయకపోవటం, డ్రైనేజీ సిస్టం నిర్వహణలో వైఫల్యం కారణంగానే ఈ నష్టం జరిగినట్లు గుర్తించారు. దీంతో కంపెనీ పై ఏడాది పాటు నిషేధం విధించటంతో పాటు 90 లక్షల రూపాయల జరిమానా కూడా విధించారు.
ఈ ప్రాజెక్ట్ ను మేఘా ఇంజనీరింగ్ హైబ్రిడ్ యాన్యుటీ మోడ్ పద్దతిలో చేపట్టింది. రోడ్డు నిర్మాణంతో పాటు కంపెనీ చేపట్టిన సెక్షన్ ను 15 సంవత్సరాల పాటు కంపెనీనే పర్యవేక్షించాల్సి ఉంటుంది. దీంతో ఇప్పుడు కూలిపోయిన వాలు పనులను కూడా మేఘా తన సొంత నిధులతో చేపట్టాల్సి ఉంటుంది. కేరళ లోని ఎన్ హెచ్ 66 వాలు కూలిపోయిన అంశంపై అధ్యనయం కోసం నిపుణల కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ చేసే సూచనల ఆధారంగా భవిష్యత్ లో చేపట్టాల్సిన చర్యలపై నిర్ణయం తీసుకోనున్నారు. ఇది ఇలా ఉంటే ఆంధ్ర ప్రదేశ్ లోని చంద్రబాబు ప్రభుత్వం ఈ సంస్థకు అసలు ఎడా పెడా వేల కోట్ల రూపాయల ప్రాజెక్ట్ లు కేటాయించిన సంగతి తెలిసిందే. ఒక్క రాజధాని అమరావతి లోనే మేఘా ఇంజనీరింగ్ కు ప్రభుత్వ భారీ ఎత్తున ప్రాజెక్ట్ లు కేటాయించింది. తాజా పరిణామాలతో అసలు ఆంధ్ర ప్రదేశ్ లో ఇంత పెద్ద మొత్తంలో సాగుతున్న పనులను పర్యవేకించేందుకు అవసరమైన క్వాలిటీ కంట్రోల్ నిపుణులు ఉన్నారా అన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. హడావుడిగా పనులు చేస్తే ఫలితం ఎలా ఉంటుందో కళ్ళ ముందు కనపడుతోంది.