Telugu Gateway
Telangana

కొత్త మ‌లుపు తిరిగిన ప్రెస్ క్ల‌బ్ వివాదం..సూర‌జ్ పై ఫిర్యాదు

కొత్త మ‌లుపు తిరిగిన ప్రెస్ క్ల‌బ్ వివాదం..సూర‌జ్ పై ఫిర్యాదు
X

అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా సాగిన హైద‌రాబాద్ ప్రెస్ క్ల‌బ్ ఎన్నిక‌ల వ్య‌వ‌హారం కొత్త మ‌లుపు తిరిగింది. హోరాహోరాగా సాగిన పోలింగ్ అనంత‌రం ఓట్ల లెక్కింపు ప్ర‌క్రియ 90 శాతం వ‌ర‌కూ అంతా స‌వ్యంగానే సాగింది. కేవ‌లం ప్రెసిడెంట్ కౌంటింగ్ స‌మ‌యంలో వివాదం త‌లెత్తింది. మిగిలిన ఏ పోస్టు విష‌యంలో ప‌రాజ‌యం పాలైన వారు ఎవ‌రూ కూడా నోటిమాట‌గా కానీ.. లిఖిత‌పూర్వ‌కంగా ఫిర్యాదు చేయ‌లేదు. ఒక్క ప్రెసిడెంట్ అభ్య‌ర్ధి సూర‌జ్ మాత్ర‌మే కౌంటింగ్ పూర్త‌యిన త‌ర్వాత అభ్యంత‌రాలు లేవ‌నెత్తారు. ప‌లుమార్లు రీకౌంటింగ్ చేసిన త‌ర్వాత వారు శాంతించ‌లేదు. ఈ వ్య‌వ‌హారంపై రిట‌ర్నింగ్ అధికారి హేమ‌సుంద‌ర్ పంజాగుట్ట పోలీసుల‌కు పిర్యాదు చేశారు. హైదరాబాద్‌ ప్రెస్‌క్లబ్‌ ఎన్నికల్లో 80 ఓట్ల తేడాతో ఓటమి పాలైన తర్వాత తమను బెదిరించి, పత్రాలను లాక్కొని, బ్యాలెట్‌ బాక్సుల్లో నీళ్లు పోసిన సూరజ్‌ వి భరద్వాజపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులు హేమసుందర్‌రావు, రంగాచార్యలు పోలీస్‌లకు ఫిర్యాదు చేశారు.

అనేక దఫాలుగా ప్రెస్‌క్లబ్‌ ఎన్నికలను నిజాయితీగా నిర్వహించి, ఎలాంటి లోటుపాట్లు లేకుండా నిర్వహించామని, అధ్యక్ష పదవికి పోటీ చేసిన సూరజ్‌ భరద్వాజ 80 ఓట్లతో ఓటమి పాలైన అనంతరం, తిరిగి ఓట్లను లెక్కించాలని కోరితే రెండుమార్లు లెక్కించామని, 80 ఓట్ల తేడాలో ఏ మార్పు లేదని తెలుసుకుని, స్వస్తిక్‌ గుర్తులు సరిగ్గా లేవని, దొంగ ఓట్లు వేశారన్న నింద మోపుతూ తనపై దౌర్జన్యపూర్వకంగా వ్యవహరించి , ఎన్నికల పత్రాలు లాక్కొని, బలవంతంగా తమను నిర్బంధించి ఎన్నికల ప్రకటన నిలుపుదల చేయాలని సంతకాలు చేశారని ఫిర్యాదు చేశారు.ఈ విషయంలో వెంటనే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి, సూరజ్‌తో పాటు ప్రెస్‌క్లబ్‌ సభ్యులు కాని వారి వివరాలు,సీసీ ఫుటేజీతో పాటు,వీడియో రికార్డులను పోలీస్‌ అధికారులకు హేమసుందర్‌రావు సోమవారం సాయంత్రం సమర్పించారు. ఫ‌లితాల అనంత‌రం దాడుల‌కు, విధ్వంసానికి పాల్ప‌డ్డార‌ని తెలిపారు. త‌మ‌ను బ‌ల‌వంతం చేసి ప్ర‌క‌ట‌న రాయించుకున్నార‌ని త‌న ఫిర్యాదులో తెలిపారు.

Next Story
Share it