Telugu Gateway
Telangana

తెలంగాణ రాజకీయాల్లో మరో సంచలనం...కీలక నేతల కొత్త పార్టీ?!

తెలంగాణ రాజకీయాల్లో మరో సంచలనం...కీలక నేతల కొత్త పార్టీ?!
X

తెలంగాణ రాజకీయాల్లో మరో కొత్త పార్టీ రాబోతోందా?. అంటే తాజా పరిణామాలు అన్నీ ఆ దిశగానే ముందుకు సాగుతున్నట్లు కనిపిస్తున్నాయి. ఖమ్మం జిల్లాకు చెందిన బిఆర్ఎస్ మాజీ ఎంపీ,కాంట్రాక్టర్ పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఈ కొత్త పార్టీ కి ఏర్పాట్లు చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. దీని పేరు కూడా పాత టిఆర్ఎస్ గుర్తుకు వచ్చేలా తెలంగాణా రైతు శ్రామిక పార్టీ (టిఆర్ఎస్ )గా నిర్ణయించినట్లు చెపుతున్నారు. వాస్తవానికి గత కొంత కాలంగా పొంగులేటి శ్రీనివాస రెడ్డి బీజేపీ లో చేరతారని బలంగా ప్రచారం జరిగింది. కానీ అది వాస్తవరూపం దాల్చలేదు. తర్వాత కాంగ్రెస్ అంటూ కూడా ప్రచారం మొదలైంది. ఏకంగా టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి దీనిపై బహిరంగ ప్రకటనే చేశారు. వస్తే స్వాగతిస్తామని. అయినా కూడా పొంగులేటి అటు వైపు మొగ్గుచూపలేదు. పొంగులేటి తో ఉన్న నాయకులు అంతా కూడా ఎక్కువ మంది కాంగ్రెస్ వైపు వెళ్లాలని అయనపై ఒత్తిడి చేస్తున్నారు. బీజేపీ తో మాత్రం వెళ్ళటానికి పొంగులేటి అనుచరులు ఏ మాత్రం సిద్ధంగా లేరు అని చెపుతున్నారు. మరో వైపు పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఖమ్మం జిల్లాలో ఉన్న పదికి పది సీట్లలో పోటీ చేస్తామని చెపుతున్నారు. ఏ పార్టీ అయినా అటు బీజేపీ అయినా, ఇటు కాంగ్రెస్ అయినా అయన చెప్పిన వాళ్లకు పది సీట్లు ఇవ్వటం అన్నది జరిగే పని కాదు.

ఇప్పటికే పొంగులేటి వైరా తో పాటు పినపాక అభ్యర్థులపై ప్రకటన చేశారు. వైరా అభ్యర్థి గా బానోత్ విజయా భాయ్ ని ప్రకటించారు. ఖమ్మం జిల్లాకు పరిమితం అయిన పొంగులేటి శ్రీనివాస రెడ్డి మరి రాష్ట్రం అంతటా ప్రభావం చూపించగలరా అన్న సందేహం రావటం ఖాయం. అయితే తెలంగాణ బీజేపీ లో తీవ్ర అసంతృప్తితో ఉన్న కీలక నేతలు అందరూ కలిసే ఈ ప్లాన్ వేసినట్లు అత్యంత విశ్వసనీయ వర్గాలు వెల్లడించారు. తెలంగాణా బీజేపీ ప్రెసిడెంట్ బండి సంజయ్ తీరుపై చాలా మంది కీలక నేతలు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు అని...వీళ్ళు అంతా ఒక గొడుగు కింద ఉండేందుకు....ఎవరి జిల్లాలో వాళ్ళు ప్రభావం చూపించే నాయకులు అంతా త్వరలోనే బీజేపీ కి గుడ్ బై చెపుతారని సమాచారం. అదే సమయంలో పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఆంధ్ర ప్రదేశ్ సీఎం, వైసీపీ అధినేత జగన్ కు కూడా అత్యంత సన్నిహితుడు అన్న విషయం తెలిసిందే. ఎన్నికల తర్వాత ఈ కొత్త పార్టీ..గెలిచినా గ్రూప్ అంతా ఎటు వైపు మళ్లుతుంది అన్నది ఇప్పుడు కీలకం కానుంది. తెలంగాణ లో ఈ సారి ఎవరికీ పూర్తి మెజారిటీ రాదు అనే అంచనాలు ఉన్న తరుణంలో ప్రతి సీట్ కూడా కీలకంగా మారనుంది.


Next Story
Share it