కొత్త రాజ్యాంగం..మా పార్టీ విధానమే
దేశానికి కొత్త రాజ్యాంగం రాసుకోవాల్సిన అవసరం ఉందని అంటూ ముఖ్యమంత్రి కెసీఆర్ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్రంలో రాజకీయ దుమారం రేగింది. కెసీఆర్ తన వ్యాఖ్యల ద్వారా అంబేద్కర్ ను అవమానించారని కాంగ్రెస్, బిజెపిలు మండిపడ్డాయి. ఇదే అంశంపై టీఆర్ఎస్ నేతలు కూడా కౌంటర్ ఎటాక్ చేశారు. మాజీ మంత్రి..ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ లు మీడియాతో మాట్లాడారు. సీఎం కెసీఆర్ చెప్పిన దాంట్లో తప్పేమీలేదని..ఇది తమ పార్టీ విధానమే అని కడియం శ్రీహరి వ్యాఖ్యానించారు. సమాజం లో అట్టడుగు వర్గాలు, పేద వారికి న్యాయం జరగాలంటే కొత్త రాజ్యాంగం రచించుకోవాలని కేసీఆర్ అన్నారన్నారు.
నిజమైన అంబేద్కర్ వారసులం తాము అయితే..గాడ్సే కు వారసులు బీజేపీ నేతలు అని మండిపడ్డారు. అసమానతలు రూపుమాపడానికి కొత్త రాజ్యాంగం అవసరం ఉందని తాము గట్టిగా నమ్ముతున్నామని పేర్కొన్నారు. అంబేద్కర్ పై నిజమైన ప్రేమ ఉంటే బీజేపీ దేశ వ్యాప్తంగా దళిత బంధు పెట్టించాలని డిమాండ్ చేశారు. బీజేపీ దేశ సంపదను అంబానీ, ఆదానీలకు దోచి పెడుతోందని విమర్శించారు. ఇపుడున్న రాజ్యాంగం లో రిజెర్వేషన్లు 50 శాతం వరకే అనుమతిస్తున్నారు, రిజర్వేషన్లు పెంచాలంటే కొత్త రాజ్యాంగం అవసరం లేదా? అని ప్రశ్నించారు.