ఎన్నికల స్టంట్ కోసమే మోడీ హైదరాబాద్ పర్యటన
ప్రధాని నరేంద్రమోడీ హైదరాబాద్ పర్యటనపై అధికార టీఆర్ఎస్ విమర్శలు ప్రారంభించింది. ఎన్నికల స్టంట్ లో భాగంగానే ఆయన ఈ పర్యటనకు వస్తున్నారని లోక్ సభలో టీఆర్ఎస్ శాసనసభాపక్ష నేత నామా నాగేశ్వరరావు ఎద్దేవా చేశారు. ఆయన శుక్రవారం తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. 'తెలంగాణ కు ఒక్క ప్రాజెక్టు అయినా బీజేపీ తెచ్చిందా ?. కనీసం నవోదయ విద్యాలయాలను కూడా తేని దుస్థితి బీజేపీ నేతలది. ఏమి అడిగినా ఇవ్వని బీజేపీ కి ఓట్లెందుకు వేయాలి. కాళ్లకు చెప్పులు అరిగేలా తిరిగినా రీజనల్ రింగ్ రోడ్డు ఎందుకు ఇవ్వరూ?. ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మాలని కేంద్రం బేరం పెడుతోంది.
న్యాయంగా రావాల్సిన డబ్బులు కూడా కేంద్రం ఇవ్వట్లేదు. అభివృద్ధికి ఆటంకం కలగకుండా ఉండాలంటే కారు గుర్తుకు ఓటెయ్యాలి. తెలంగాణకు వస్తున్న కేంద్రమంత్రులు చెప్పే మాయ ,మోసపూరిత మాటలు ప్రజలు నమ్మొద్దు. .కోవిడ్ వ్యాక్సిన్ హైదరాబాద్ లో తయారు అవటం గొప్ప విషయం. పీఎం మోడీ తన పర్యటన సందర్భంగా మాయ మాటలు చెప్పొద్దు. రేపు హైదరాబాద్ నుంచి తెలంగాణ కు ఫ్రీ వ్యాక్సిన్ ఇస్తామంటారు మోడీ.' అని నామా వ్యాఖ్యానించారు.