సాగర్ టీఆర్ఎస్ అభ్యర్ధిగా నోముల భగత్
అధికార తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) నాగార్జున సాగర్ ఉప ఎన్నికకు అభ్యర్ధిని ఖరారు చేసింది. దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య కొడుకు నోముల భగత్ కుమార్ కే అధిష్టానం టిక్కెట్ ఖరారు చేసింది. దీంతో ఇంత కాలంగా దీనిపై కొనసాగిన సస్పెన్స్ కు తెరపడినట్లు అయింది. నామినేషన్లకు మంగళవారం నాడే చివరి రోజు. టీఆర్ఎస్ తోపాటు బిజెపిలు కూడా అభ్యర్ధి విషయంలో చివరి నిమిషం వరకూ సస్పెన్స్ కొనసాగిస్తూ వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ ఇఫ్పటికే తమ అభ్యర్ధిగా మాజీ మంత్రి జానారెడ్డిని ప్రకటించిన విషయం తెలిసిందే. ఆయన ఇఫ్పటికే ప్రచారంలో ముందు ఉన్నారు.
టీఆర్ఎస్ అభ్యర్ధి ఎవరో తేలిపోవటంతో ఇక నుంచి మంత్రులు కూడా రంగంలోకి దిగనున్నారు. సీఎం కెసీఆర్ కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొనేలా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. అయితే నాగార్జునసాగర్ టీఆర్ఎస్ టిక్కెట్ ఆశించిన కోటిరెడ్డిని పార్టీ నేతలు బుజ్జగిస్తున్నారు. ఆయన్ను మంత్రి జగదీష్ రెడ్డి తన వెంటపెట్టుకుని ప్రగతిభవన్ కు తీసుకెళ్ళి నట్లు సమాచారం. మరో వైపు కోటిరెడ్డికి బిజెపి టిక్కెట్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని ప్రచారం జరుగుతున్న తరుణంలో ఈ వ్యవహారం ఆసక్తికరంగా మారింది.