కోటి రూపాయల లంచం కేసు...మిస్టరీ ఆత్మహత్యలు
నాగరాజు. కీసర మాజీ తహశీల్దార్. కోటి రూపాయల లంచం కేసులో అరెస్ట్ అయి చంచల్ గూడ జైలులోనే ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇది పెద్ద మిస్టరీగా మారింది. నాగరాజు కుటుంబ సభ్యులు మాత్రం ఆయనది ఆత్మహత్య కాదని..హత్యే అని ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంపై సర్కారు మాత్రం మౌనంగా ఉంది. ఇదిలా ఉంటే ఇదే కేసుకు సంబంధించి మరో వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆదివారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. సంచలనం సృష్టించిన కీసర తహసీల్దార్ కోటి రూపాయల లంచం కేసులో మరో నిందితుడు ఆత్మహత్య చేసుకున్నారు. నాగరాజు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ధర్మారెడ్డి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు.
కోటి రూపాయల లంచం కేసులో ఇటీవల బెయిల్‌పై బయటకు వచ్చిన ధర్మారెడ్డి కుషాయిగూడ, వాసవి శివ నగర్‌లోని శివాలయంలో చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. భూమి అక్రమ మ్యుటేషన్ ఆరోపణతో ఏసీబీ ఇతన్ని అరెస్ట్ చేయగా.. 33 రోజుల పాటు జైలు జీవితం గడిపాడు. ప్రస్తుతం ఆయన వయసు 80 ఏళ్లు. ఇదే కేసులో అరెస్ట్ అయిన దర్మారెడ్డి కుమారుడు శ్రీధర్ రెడ్డికి బెయిల్ రాకపోవడంతో ఇంకా జైల్లోనే ఉన్నాడు. ఒకే కేసుకు సంబంధించి ఓ తహశీల్దార్ ఇప్పుడు మరో వ్యక్తి ఆత్మహత్య చేసుకోవటం కలకలంగా మారింది.