Telugu Gateway
Telangana

బిజెపికి మోత్కుప‌ల్లి న‌ర్సింహులు రాజీనామా

బిజెపికి మోత్కుప‌ల్లి  న‌ర్సింహులు రాజీనామా
X

సీనియ‌ర్ నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు బిజెపికి రాజీనామా చేశారు. టీడీపీ నుంచి బ‌య‌టకు వచ్చిన త‌ర్వాత ఆయ‌న క‌మ‌ల తీర్థం పుచ్చుకున్నారు. అక్క‌డ ఎన్నో రోజులు ఉండ‌లేక‌పోయారు. కొద్ది రోజుల క్రితం ముఖ్య‌మంత్రి కెసీఆర్ అధ్య‌క్ష్య‌త‌న జ‌రిగిన ద‌ళిత సాధికార స‌మావేశానికి హాజ‌ర‌య్యారు. బిజెపి నిర్ణ‌యానికి భిన్నంగా ఆయ‌న కెసీఆర్ ద‌గ్గ‌ర స‌మావేశానికి హాజ‌ర‌వ‌టమే కాకుండా..త‌న వ‌ల్లే బిజెపికి ఈ అంశంలో నష్టం జ‌ర‌గ‌లేదంటూ వ్యాఖ్యానించారు. త‌న సీనియారిటీని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుని త‌న‌కు ఎలాంటి ప‌ద‌వులు కూడా ఇవ్వ‌లేద‌ని, అదే స‌మ‌యంలో త‌న అభిప్రాయం తీసుకోకుండానే ఈటెల రాజేంద‌ర్ ను పార్టీలోకి తీసుకున్నార‌ని త‌ప్పుప‌ట్టారు. ద‌ళితుల భూముల‌ను ఆక్ర‌మించుకున్న ఆయ‌న పార్టీలోకి తీసుకోవ‌టం త‌న‌కు న‌చ్చ‌లేద‌న్నారు. రాజ‌కీయాల్లో విలువ‌ల కోసం ప‌నిచేసే త‌న‌ను దూరం పెట్ట‌డం బాధించింద‌ని బిజెపి రాష్ట్ర ప్రెసిడెంట్ బండి సంజయ్ కు పంపిన లేఖ‌లో పేర్కొన్నారు.

ఈటెల రాజేంద‌ర్ అవినీతిప‌రుడు అని ఆరోపించారు. ఆయ‌న‌కు అంత ఆస్తి ఎలా వ‌చ్చింద‌ని ప్ర‌శ్నించారు. ఈటెల‌ను హుజూరాబాద్ ప్ర‌జ‌లు బ‌హిష్క‌రించాని పిలుపునిచ్చారు. తాజా ప‌రిణామాలనుబ‌ట్టి చూస్తే ఆయ‌న కూడా అధికార టీఆర్ఎస్ కండువా క‌ప్పుకునే అవ‌కాశం ఉంది. అందుకే ఈటెల‌ను టార్గెట్ చేస్తూ మీడియా ముందుకు వ‌చ్చారు. దీంతో ఇది అంతా స్క్రిప్ట్ ప్ర‌కార‌మే సాగుతున్న‌ట్లు క‌న్పిస్తోంది. హుజూరాబాద్ ఉప ఎన్నిక‌ల వేళ టీఆర్ఎస్ వ‌ర‌స పెట్టి చేరిక‌ల‌కు గేట్లు ఎత్తేసింది. ఇప్ప‌టికే ఎల్ ర‌మ‌ణ‌, పాడి కౌశిక్ రెడ్డి చేరిన విష‌యం తెలిసిందే. ఇప్పుడు మోత్కుప‌ల్లి కూడా కారెక్కితే అతి త‌క్కువ కాలంలో ముగ్గురు కీల‌క నేత‌లు చేరిన‌ట్లు అవుతుంది.

Next Story
Share it