Telugu Gateway
Telangana

యూపీ ఎన్నిక‌ల కోస‌మే మోడీ నిర్ణ‌యం

యూపీ ఎన్నిక‌ల కోస‌మే మోడీ నిర్ణ‌యం
X

వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను ర‌ద్దు చేస్తున్న‌ట్లు ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ చేసిన ప్ర‌క‌ట‌న‌పై టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. కేవలం యూపీ ఎన్నికల కోసమే బిజెపి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని రేవంత్ విమర్శించారు. ప్రాణాలు పోయిన రైతు కుటుంబాలకు మోడీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. 50 లక్షల పరిహారం ఇవ్వాల్సిందేనన్నారు. అయితే రైతు చట్టాలు వెనక్కి తీసుకోవడం వెన‌క రైతులు చేసిన పోరాటం ఉంద‌న్నారు. కేంద్రం రైతు చట్టాలను వెనక్కి తీసుకున్న నేపద్యంలో శుక్రవారం కామారెడ్డిలో ఆయ‌న మీడియాతో మాట్లాడారు. నరేంద్ర మోడీ మెడలు వంచేవిధంగా రైతులు పోరాటం చేశారని ఆయన పేర్కొన్నారు. వరిధాన్యం కొనుగోలులో తెలంగాణ ప్రభుత్వం విఫలం అయ్యిందన్నారు.

రైతులపై కక్ష సాధింపులో భాగంగానే కేసీఆర్ ధాన్యం కొనడం లేదని ఆయన పేర్కొన్నారు.టిఆర్ఎస్ బీజేపీలు వీధి నాటకాలు ఆడుతున్నాయని విమర్శించారు. ఎవరికి వ్యతిరేకంగా ధర్నాలు చేస్తున్నారో బండి సంజయ్ సమాధానం చెప్పాలన్నారు. వైన్స్ అప్లికేషన్ల తో వచ్చిన 12 వేలకోట్ల ఆదాయంతో ధాన్యం కొనుగోలు చేయాలని అన్నారు. టీఆర్ఎస్ నేత‌లు త‌మ పోరాటం వ‌ల్లే మోడీ రైతు చ‌ట్టాలు వెన‌క్కి తీసుకుంటున్నార‌ని చెప్పుకోవ‌టం సిగ్గుచేట‌న్నారు. నిజంగా టీఆర్ఎస్ కు అంత సీన్ ఉంటే..మోడీని భ‌య‌పెట్టే శ‌క్తి ఉంటే..ఆ ప‌ని చేసి తెలంగాణ రైతుల ద‌గ్గ‌ర నుంచి ధాన్యం కొనుగోలు చేయించ‌వ‌చ్చు క‌దా అని ఎద్దేవా చేశారు.

Next Story
Share it