Telugu Gateway
Telangana

కవిత వ్యాపార విస్తరణ ఒక రేంజ్ లో ఉందే!

కవిత వ్యాపార విస్తరణ ఒక రేంజ్ లో ఉందే!
X

తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత మరింత చిక్కుల్లో పడినట్లు కనిపిస్తోంది. ఇంత కాలం కేవలం ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమె ఆమె ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగంలో కూడా భారీగా పెట్టుబడులు పెట్టినట్లు ఈడీ చెపుతోంది. ఇది చూసిన వాళ్ళు మాత్రం కవిత వ్యాపార విస్తరణ మాములుగా లేదుగా అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. లిక్కర్ వ్యాపారంలో వచ్చిన డబ్బులను కవిత రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టినట్లు తాజాగా ఈడీ ఢిల్లీ లో రౌజ్ అవెన్యూ కోర్ట్ కు సమర్పించిన అదనపు ఛార్జ్ షీట్ లో అభియోగాలు మోపింది. అంతే కాదు...ఇందులో తొలిసారి ఎమ్మెల్సీ కవిత భర్త అనిల్ కుమార్ పేరు కూడా తెరమీదకు రావటం మరో సంచలనంగా చెప్పుకోవచ్చు. కవిత మాజీ ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబు అప్రూవర్ గా మారినట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఈడీ అయన ఇచ్చిన స్టేట్ మెంట్స్ ఆధారంగానే తాజాగా ఈ భూ లావాదేవీల అంశాన్ని ప్రస్తావించటం విశేషం. లిక్కర్ స్కాం లో వచ్చిన డబ్బులనే రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులుగా పెట్టారు అని...కవిత తరపున అరుణ్ రామచంద్ర పిళ్ళై ఈ ల్యాండ్ డీల్స్ చేసారని....వీటికి చెల్లింపులు కూడా ఆయనే కవిత తరపున చేసినట్లు ఈడీ పేర్కొంది. అసలు కొనుగోలు చేసిన భూములు ఎక్కడ ఉన్నాయి....అవి అసలు ఎలా ఉన్నాయి అనేది కూడా చూడకుండానే చెల్లింపులు చేశారు అని..కవిత తరపున పిళ్ళై తో పాటు ఫీనిక్స్ కు చెందిన శ్రీహరి, మరికొంత మంది ఆమె తరపున లావాదేవీలు పూర్తి చేశారు అని ఈడీ తేల్చింది. ఫీనిక్స్ కు చెందిన శ్రీహరి నుంచి కవిత ఏకంగా 25 వేల చదరపు అడుగులు ఆస్తి కొనుగోలు చేశారు. అక్కడ మార్కెట్ విలువ చదరపు అడుగు 1760 రూపాయలుగా ఉంటే కవిత కు మాత్రం 1260 రూపాయలకు మాత్రమే ఇచ్చారు.

దీంతో పాటు కవిత తరపున పిళ్ళై వట్టినాగుల పల్లిలో సుమారు నాలుగు ఎకరాల భూమి కొన్నారు. ఈ భూమిని కవిత ఆదేశాల మేరకే రామచంద్ర పిళ్ళై కొన్నారు అని...ఈ భూమి కవిత ది కాదు అని చెప్పటానికి హడావుడిగా దీన్ని అరుణ్ రామచంద్ర పిళ్ళై భార్య పేరు మీద రిజిస్టర్ చేయించారు అని ఈడీ అభియోగం మోపింది. వాస్తవానికి ఇంతకాలం రాష్ట్ర కాబినెట్ లో ని కీలక మంత్రికి బినామీ పేర్ల మీద లక్షల చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ ఉంది అని రాజకీయ వర్గాల్లో ప్రచారంలో ఉంది. కొద్ది రోజుల క్రితం వరసగా జరిగిన ఐటి దాడుల సమయంలో కూడా ఈ అనుమానిత లావాదేవీలు పలు బయటపడినట్లు సమాచారం. ఈ తరుణంలో కవిత లిక్కర్ స్కాం లోనే కాకుండా రియల్ ఎస్టేట్ డీల్స్ కూడా చేశారు అని....ఇందులో ఫీనిక్స్ పేరు కూడా వెలుగులోకి రావటంతో ఇది రియల్ ఎస్టేట్ రంగాల్లో ఆసక్తికర చర్చకు కారణం అవుతోంది. బుచ్చిబాబు నుంచి ఈడీ ఇంకా ఎన్ని సంచలన విషయాలు రాబట్టిందో అనే చర్చ కూడా సాగుతోంది. లిక్కర్ దగ్గర స్టార్ట్ అయినా ఈ వ్యవహారం ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో వేచిచూడాల్సిందే. అయితే కేంద్రంలోని బీజేపీ సర్కారు ఈ మొత్తం వ్యవహారాన్ని తన రాజకీయ అవసరాల కోసం వాడుకుంటుందా...లేక చిత్తశుద్ధితో కేసు ను ఒక లాజికల్ ముగింపునకు తెచ్చేందుకు ప్రయత్నిస్తుందా అన్న దానిపై చాలా మందిలో అనుమానాలు ఉన్నాయి. ఈ విషయం భవిష్యత్తులో కానీ తేలదు.

Next Story
Share it