మోడీపై కెటీఆర్ సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటీఆర్ ప్రధాని నరేంద్రమోడీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం నాడు మోడీ ముచ్చింతాలలో రామానుజాచార్య విగ్రహావిష్కరణ చేసిన విషయం తెలిసిందే. పక్షపాతానికి ఐకాన్‌లాంటి వ్యక్తి(ప్రధాని మోదీని ఉద్దేశిస్తూ..) సమానత్వమూర్తి విగ్రహాన్ని ఆవిష్కరించారంటూ.. స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ట్యాగ్‌తో కేటీఆర్ ట్వీట్ చేశారు. దీని వల్ల ఆయనకు ఆశించిన ఫలితం రాదంటూ పేర్కొన్నారు. కెటీఆర్ ట్వీట్ పై బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ ట్విట్టర్ వేదికగానే స్పందిస్తూ బర్నాల్ మూమెంట్ అంటూ కామెంట్ చేశారు. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో బిజెపి వర్సెస్ టీఆర్ఎస్ ల మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం సాగుతున్న విషయం తెలిసిందే. కేంద్ర బడ్జెట్ పై స్పందన సందర్భంగా సీఎం కెసీఆర్ అయితే గతంలో ఎన్నడూలేని రీతిలో అటు ప్రధాని మోడీని, కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
అదే సమయంలో ప్రధాని మోడీ హైదరాబాద్ పర్యటనకు సీఎం కెసీఆర్ పూర్తిగా దూరం ఉండటం చర్చనీయాంశంగా మారింది. దీనిపై బిజెపి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించటంతో టీఆర్ఎస్ తరపున కొంత మంది ఇది పూర్తిగా ప్రైవేట్ కార్యక్రమం అని..ప్రైవేట్ కార్యక్రమానికి వచ్చిన ప్రధానికి సీఎం స్వాగతం అవసరం లేదంటూ ప్రచారం మొదలుపెట్టారు. అయితే లీకుల్లో మాత్రం కెసీఆర్ కు ఆరోగ్యం బాగాలేనందునే రాలేదంటూ మీడియాకు సమాచారం ఇచ్చారు. ఈ వివాదాన్ని కొనసాగిస్తూ మంత్రి కెటీఆర్ దీనిపై ఆదివారం నాడు మరో ట్వీట్ చేశారు.