Telugu Gateway
Telangana

కెటీఆర్ అండ‌తోనే రెచ్చిపోతున్న డ్ర‌గ్ మాఫియా

కెటీఆర్ అండ‌తోనే రెచ్చిపోతున్న డ్ర‌గ్ మాఫియా
X

తెలంగాణ ఐటి, ప‌రిశ్ర‌మ‌ల శాఖ‌మంత్రి కెటీఆర్ పై కాంగ్రెస్ పార్టీ మ‌రోసారి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. డ్రగ్స్ విష‌యంలో మంత్రి కెటీఆర్ కు చిత్త‌శుద్ధి ఉంటే ఎన్ సీబీ సార‌ధ్యంలో సిట్ ఏర్పాటు చేయాల‌ని తెలంగాణ కాంగ్రెస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ మ‌హేష్ కుమార్ గౌడ్ డిమాండ్ చేశారు. ఆయ‌న ఆదివారం నాడు మీడియాతో మాట్లాడుతూ మంత్రి కెటీఆర్ క‌నుస‌న్న‌ల్లోనే ప‌బ్ లు న‌డుస్తున్నాయ‌ని..ఆయ‌న అండ‌తోనే డ్ర‌గ్స్ మాపియా రెచ్చిపోతుంద‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ఈ అంశంపై గ‌వ‌ర్న‌ర్ కూడా స్పందించాల‌ని..ఇందులో ఎవ‌రి ప్రమేయం ఉన్నా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు. కేటీఆర్ పదేపదే గోవా ఎందుకు వెళ్తున్నారని మహేష్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు.

డ్రగ్స్ ఛాలెంజ్‌లో కేటీఆర్ కోర్టును ఎందుకు ఆశ్రయించారన్నారు. డ్రగ్స్ అలవాటు లేకపోతే.. కేటీఆర్ శాంపిల్ ఇవ్వాలన్నారు. 2014లో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక మద్యం ఏరులై పారుతోందన్నారు. గంజాయి, డ్రగ్స్ విచ్చిలవిడిగా అమ్ముతున్నారన్నారు. శాంతి భద్రతలు అదుపు తప్పాయన్నారు. ఎవరి ప్రమేయంతో అర్ధరాత్రి 3 గంటల వరకు పబ్‌లు తెరిచి ఉంచుతున్నారని ప్రశ్నించారు.డ్ర‌గ్స్ కేసుకు సంబంధించి ఏసీపీకి మెమో, సిఐని సస్పెండ్ చేయడం సరికాదన్నారు. గతంలో డ్రగ్స్ కేసును అట్టకెక్కించారని విమర్శించారు.

Next Story
Share it