Telugu Gateway
Telangana

హైదరాబాద్ గులాబీలా..గుజరాత్ గులాంలా?

హైదరాబాద్ గులాబీలా..గుజరాత్ గులాంలా?
X

జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో తెలంగాణ మంత్రి కెటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నగర ప్రజలు హైదరాబాద్ గులాబీలు కావాలా..లేక గుజరాత్ గులాంలా ఆలోచించుకోవాలన్నారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఈ ఆరేళ్లలో హైదరాబాద్ కోసం చేసింది ఏమీలేదని విమర్శించారు. తాము ఆరేళ్ళలో ఏమేమి చేశామో సుదీర్ఘంగా వివరించగలమన్నారు. కేంద్రానికి తెలంగాణ ప్రజలు కట్టిన పన్నులు 2.72 లక్షల కోట్ల రూపాయలు అయితే..కేంద్రం రాష్ట్రానికి ఇచ్చింది 1.40 లక్షల కోట్ల రూపాయలు మాత్రమే అన్నారు. తెలంగాణ లాంటి ఐదారు రాష్ట్రాలు మాత్రమే దేశానికి నిధులు సమకూర్చిపెడుతున్నాయని తెలిపారు. ఓట్ల కోసం బిజెపి నాయకులు ఎంతకైనా దిగజారటానికి సిద్ధంగా ఉన్నారని ఎద్దేశా చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్ధులను గెలిపించాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వం వరద బాధితులకు అందిస్తున్న 10 వేల రూపాయల సాయాన్ని ఆపిన వారు 25 వేల రూపాయలు ఇస్తామంటే ఎవరైనా నమ్ముతారా? అని కెటీఆర్ ప్రశ్నించారు.

బిజెపి పాలిత రాష్ట్రాలకు వరద సాయంపై ఆగమేఘాలపై స్పందించిన కేంద్రం తెలంగాణ విషయంలో మాత్రం వివక్ష చూపిస్తోందని ఆరోపించారు. కెటీఆర్ నగరంలో జరిగిన మరో సమావేశంలో మాట్లాడుతూ ముఖ్యంగా నగర ప్రజలు విధిగా ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. ట్విట్టర్ లో వాళ్ళు అవినీతిపరులు..వీళ్లు అవినీతిపరులు అంటే ఉపయోగం ఉండదని..బయటకు వచ్చి ఓటు వేయకపోతే అలాంటి వారే ఉంటారని వ్యాఖ్యానించారు.గ్రామీణ ప్రాంతాల్లో ఓటింగ్ శాతం 80 శాతం వరకూ వెళుతుంటే నగరంలో మాత్రం 45 శాతం వద్దే ఆగుతుందని అన్నారు. అన్నీ ఆలోచించుకుని టీఆర్ఎస్ కు ఓటు వేయాలని తాను కోరుతున్నానని. లేకపోతే కనీసం బయటకు వచ్చి నోటాకు అయినా ఓటు వేయాలన్నారు. ఓటు వేయని వారికి మాట్లాడే హక్కు ఉండదన్నారు.

Next Story
Share it