Telugu Gateway
Telangana

మీడియా ప్రతినిధులపై కెటిఆర్ అసహనం

మీడియా ప్రతినిధులపై కెటిఆర్ అసహనం
X

పరీక్షలు పెట్టాల్సిన టిఎస్ ఎస్ఎస్ సి కే అవసరం అయినంత..సరిపడినంత మంది సిబ్బంది లేక పోవటం ఎవరి వైఫల్యం. ఈ బాధ్యత కూడా టిఎస్ ఎస్ఎస్ సి దేనా. ఒక వైపు పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు భర్తీ చేయాలని నిర్ణయించిన తెలంగాణ సర్కారుకు అందుకు అవసరం అయిన సిబ్బందిని ఇవ్వాల్సిన బాధ్యత లేదా. ఇక్కడే కెసిఆర్ సర్కారు ఘోర తప్పిదం కనిపిస్తోంది. ఏ సంస్థ అయినా చేయాల్సిన పనికి అవసరం అయినంత సిబ్బందిని ఇస్తేనే ఆ పనిని ఎక్కడా తప్పులు లేకుండా చేయగలుగుతుంది. కానీ ఇక్క్డడ అది జరగలేదు. కానీ ఇప్పుడు మంత్రి కెటిఆర్ మాత్రం ఇద్దరు వ్యక్తులు చేసిన తప్పును వ్యవస్థకు ఎలా ఆపాదిస్తారు అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ మరో దారుణం ఏమిటి అంటే రద్దు అయిన పరీక్షలు అన్నీ ఒక్కసారే జరిగినవి కావు . ఒక్కో సారి ఒక్క పరీక్ష జరిగింది. అంటే ఎప్పటికప్పుడు ఈ ప్రశ్నపత్రాలు దొంగిలించారా?. లేక అన్నీ ఒకేసారి తీసుకెళ్లారా? ఆలా అయితే వీటికి ఉన్న భద్రత ఏపాటిదో అర్ధం చేసుకోవచ్చు. చైర్మన్ కూడా ఈ విషయంలో సరిగా వ్యవహరించ లేదు అనే విమర్శలు ఎదుర్కుంటున్నారు.

టిఎస్ ఎస్ఎస్ సి గ్రూప్ వన్ పరీక్ష జరిపింది 2022 అక్టోబర్ 16 న

ఏఈఈ పరీక్ష జరిపింది 2023 జనవరి 22 న

డీఏఓ పరీక్ష పెట్టింది ఫిబ్రవరి 26 న

అసిస్టెంట్ ఇంజినీర్ పరీక్ష 2023 మార్చి 5 న జరిగింది ఈ నాలుగు పరీక్షల ప్రశ్నపత్రాలు లీక్ అయ్యాయి. ఆ పరీక్షలు రద్దు అయ్యాయి. అంటే ఈ పేపర్ లు లీక్ చేసిన వారికి టిఎస్ ఎస్ఎస్ సి లో ఎలాంటి ఇబ్బంది లేదు అన్న మాట.

అంటే వరసగా నాలుగు పరీక్షల పేపర్ లు లీక్ అయినా కూడా కమిషన్ లో కీలక స్థానాల్లో ఉన్న వారు ఎవరు గుర్తించలేదు అంటే పరిస్థితి ఎలా ఉందో ఊహించుకోవచ్చు.

లక్షలాది మంది విద్యార్థుల కు సంబంధించిన ఎంతో కీలక ప్రశ్నపత్రాలను ఎవరో బయటి వ్యక్తులు ఈజీ గా యాక్సిస్ పొందేలా ఉంచారంటే ఇక్కడ తప్పు ఎవరిది.

గోప్యత పాటించాల్సిన సెక్షన్ లో ఉన్న వారిపై టిఎస్ పీఎస్ సి అసలు ఎలాంటి నిఘా పెట్టింది. ఈ సిబ్బంది సెల్ ఫోన్స్ మానిటర్ చేయాలని...అనలైజ్ చేయాలని చైర్మన్ ఒక్కసారి అయిన ఇంటెలిజెన్స్ డిపార్ట్ మెంట్ కు లేఖ రాశారా?

తెలంగాణ లో పేపర్ లీక్ గురించి మాట్లాడితే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో.గుజరాత్ లో 13 సార్లు జరిగింది అంటున్నారు. ఇదే ఏమైనా లీక్ ల పోటీనా పోల్చుకోవటానికి.

కెటిఆర్ పదే పదే ఇద్దరు వ్యక్తులు...ఇద్దరు వ్యక్తులు అంటున్నారు వాళ్ళు చేసిన తప్పు కారణంగా ఏ మాత్రం సంబంధం లేని లక్షలాది మంది ఇప్పుడు తీవ్ర సమస్యల్లో చిక్కుకున్నారు.

గత కొన్ని సంవత్సరాలుగా కష్టపడి..చదివి పరీక్ష రాసిన వారి మానసిక ఒత్తిడి...ఆందోళన, ఆర్థిక సమస్యలు తీర్చేది ఎవరు.?.

కెటిఆర్ ఈ మధ్య మీడియా..స్వేచ్ఛ గురించి మాట్లాడారు. కానీ ఆయనే శనివారమే నాటి మీడియా సమావేశంలో ప్రశ్నలు అడిగిన వారిపై అసహనం వ్యక్తం చేశారు. ఇంత పెద్ద ఇష్యూ లో మీడియా నే ప్రశ్నలు అడగనివ్వని కెటిఆర్ ఇక ప్రజలకు సమాధానం చెపుతారా? అనే చర్చ సాగుతోంది. మీడియా నుంచి ప్రశ్నలు వస్తున్నా తాను చెప్పదలచుకున్నది చెప్పి కొన్ని ప్రశ్నలకు మాత్రమే సమాధానం ఇచ్చి వెళ్లిపోయారు. తెలంగాణాలో పేపర్ లీక్..పరీక్షల రద్దు గురించి స్పందిస్తూ గుజరాత్ లో అన్ని సార్లు అయింది...మరో రాష్ట్రం లో ఇన్ని సార్లు అయింది అని లెక్కలు చెప్పటానికి ఇది ఏమైనా లీక్ ల పోటీనా అనే విమర్శలు వినిపిస్తున్నాయి.

మీడియా సమావేశం లో కెటిఆర్ చెప్పిన అంశాలు

పేపర్ లీక్‌పై నిపుణులతో చర్చించాం, టిఎస్ పీ ఎస్ సి ద్వారా 37 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని, 10 లక్షల మందికి ఒకేసారి పరీక్ష నిర్వహించిన ఘనత ఉందని అన్నారు . ఇద్దరు చేసిన తప్పునకు మొత్తం వ్యవస్థకే చెడ్డపేరు వచ్చిందని, పేపర్ లీకేజీ వెనుక ఎంతటివారున్నా వదిలిపెట్టేది లేదని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. రద్దయిన పరీక్షలకు మళ్లీ ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేదని, ఇకపై జరిగే పరీక్షలను మరింత పటిష్టంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు. గతంలో హాజరైన వారిని అర్హులుగా గుర్తిస్తామని, కోచింగ్ మెటీరియల్‌ను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచుతామని వెల్లడించారు. నిరుద్యోగుల విషయంలో చిత్తశుద్ధితో ఉన్నామని, త్వరలోనే ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నామని కేటీఆర్ ప్రకటించారు.

ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని, అపోహలు సృష్టించేవారిని నమ్మొద్దని మంత్రి కేటీఆర్ తెలంగాణ యువతకు సూచించారు. పేపర్ లీక్ వెనుక కుట్ర కోణం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. నిందితుడు రాజశేఖర్‌రెడ్డి బీజేపీ కార్యకర్త అని తెలిపారు. లీకేజ్ ఘటనపై సమగ్ర విచారణ జరపాలన్నారు. ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు కుట్ర జరుగుతోందని అన్నారు. ‘‘ఐటీ మంత్రిని ఎందుకు బర్తరఫ్‌ చేయాలి. అసలు ఐటీ మంత్రి ఏం చేస్తారో మీకు తెలుసా?’’ అని ప్రశ్నించారు. ఉద్యోగాల గురించి బీజేపీ మాట్లాడటం హాస్యాస్పదమని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు. ప్రవీణ్, రాజ శేఖర్ రెడ్డి కాదు...ఇంకా ఇందులో ఎవరు ఉన్నా చర్యలు తీసుకుంటాం అని తెలిపారు..

Next Story
Share it