ఉద్యోగుల జీతాల ఆలశ్యం పెద్ద విషయం కాదు
తెలంగాణలో ఉద్యోగులకు జీతాలు ఆలశ్యం కావటం పెద్ద విషయం కాదని మంత్రి కెటీఆర్ వ్యాఖ్యానించారు. ఉద్యోగుల జీతాలను భారీగా పెంచింది సీఎం కెసీఆరే..దేశంలో ఎక్కడా అమలు కాని సంక్షేమ కార్యక్రమాలు రాష్ట్రంలోనే అమలు అవుతున్నాయని అన్నారు. పరిస్థితులను బట్టి జీతాల చెల్లింపు ఆలశ్యం అవుతుందని..అది పెద్ద విషయం కాదన్నారు. కెటీఆర్ శుక్రవారం నాడు హైదరాబాద్ లో మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ముఖ్యంగా ఇటీవల వచ్చిన కొన్ని సర్వేలను ఆయన ప్రస్తావించారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ 90 సీట్లతో హ్యాట్రిక్ విజయం సాధిస్తుందని పేర్కొన్నారు. అదే సమయంలో ముందస్తు ఎన్నికలు ఉండవని..షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలకు వెళతామని తెలిపారు. పార్టీలో చేరికలపై తాము ఎవరినీ బలవంతం చేయలేదని పేర్కొన్నారు. దక్షిణాదిలో వరుసగా మూడోసారి సీఎం అయిన నేత ఎవరూ లేరు కానీ కెసీఆర్ చరిత్ర తిరగరాస్తారన్నారు. వచ్చే ఎన్నికల్లో బలాలు.. బలహీనతలు ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తామని తెలిపారు. తెలంగాణ అభివృద్ధిలో కేంద్రం పాత్ర లేదు. నేను చెప్పింది అబద్ధం అని నిరూపిస్తే నా పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు.
తెలంగాణ గవర్నర్ తో మాకు పంచాయితీ లేదు. రాహుల్ గాంధీ సిరిసిల్లకు వస్తే స్వాగతిస్తాం. కాంగ్రెస్ పాలనలో ఎట్లున్నది.. ఇప్పుడు ఎట్లున్నదనేది రాహుల్ చూడాలి. రాహుల్ గాంధీ రెండు రోజులు సిరిసిల్లలో ఉండాలని కోరుతున్నా. కేసీఆర్ అభివృద్ధి ఎలా చేశారో చూసి నేర్చుకోవాలి. రాహుల్‌కి అమేథి, రేవంత్‌కి కొడంగల్‌లో చెల్లని నాణేలు అని ఎద్దేవా చేశారు. సీఎం కెసీఆర్ దొర అయితే ఎంత మందిని జైల్లో వేశారని ప్రశ్నించారు. సీఎం కెసీఆర్ ఎవరికి లొంగరని, బెదరని వ్యాఖ్యానించారు. కొత్త రేషన్ కార్డులపై త్వరలో సీఎం కెసీఆర్ నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. ప్రధాని మోడీపై కెటీఆర్ మరోసారి విమర్శలు గుప్పించారు. మానవత్వం ఉన్న ప్రధాని అయితే వరదలు వచ్చినప్పుడు ముందస్తు సాయం చేయాలన్నారు. మోడీ దేశానికి ప్రధాని కాదు..గుజరాత్ కు ప్రధాని అని విమర్శించారు. రాష్ట్రంలో వరద పరిస్థితి ఉంటే ఉపాధి హామీ పథకంలో అక్రమాలు జరిగాయంటూ టీమ్ లను పంపారని మండిపడ్డారు. కాంగ్రెస్ హయంలో శ్రీశైలం, కల్వకుర్తి పంపుహౌస్‌లు మునిగిపోయాయి. ప్రకృతి విపత్తుల వల్ల పంప్‌హౌస్‌లోకి నీళ్లు వస్తే ఎవరేం చేస్తారు''ని ప్రశ్నించారు. కాళేశ్వరంలో పంపుల మునకపై స్పందిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.