ఈటెల హిట్లర్ వారసుల సరసన చేరారు
నాకూ ఈటెల గతే అని కలలు కంటున్నారు...అది జరగదు
భూముల అమ్మకం రాష్ట్ర అభివృద్ధి కోసమే
బిజెపిలో చేరిన మాజీ మంత్రి ఈటెల రాజేందర్ పై టీఆర్ఎస్ నేతలు విరుచుకుపడ్డారు. అన్నింటా విఫలమైన బిజెపిలో చేరి ఆయన ఏమి చేస్తారన్నారు. ఈటెల రాజేందర్ మునిగే పడవ ఎక్కారని..ఆయనతోపాటు బిజెపి కూడా మునుగుతుందని మంత్రి జగదీష్ రెడ్డి జోస్యం చెప్పారు. ఆయన చెబుతున్న దానికి చేస్తున్న దానికి పొంతన లేదని ఎద్దేవా చేశారు. రాజేందర్ హిట్లర్ వారసుల సరసన చేరారని వ్యాఖ్యానించారు. జగదీష్ రెడ్డి సోమవారం నాడు టీఆర్ఎస్ ఎల్పీలో పార్టీ నేతలతో కలసి మీడియా సమావేశంలో మాట్లాడారు. టీ ఆర్ ఎస్ లో ఆయనకు సమస్యలు పెద్దగా లేవని, ఏమైనా ఉన్నా కూడా కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారమయ్యేవన్నారు. ప్రజలంతా వ్యతిరేకిస్తున్న పార్టీ బీజేపీ అని, మొన్నటి దాకా బీజేపీ ని తిట్టిన ఈటెల ఇపుడు ఆ పార్టీ ఏం మారిందని చేరాడని ప్రశ్నించారు.
టీ ఆర్ ఎస్ కన్నా బీజేపీ ఏ విధంగా మెరుగో ఈటెల చెప్పాలని, అది ప్రజా వ్యతిరేక పార్టీ అన్నారు. హుజూరా బాద్ ప్రజలకు ఈటెల ద్రోహం చేశారని ఆరోపించారు. ఈటెల రాజేందర్ కు ప్రత్యేక ఏజెండా ఉందనే విషయం ఆయన బిజెపిలో చేరటం ద్వారా తేలిపోయిందని అన్నారు. హుజూరాబాద్ ప్రజలు సీఎం కెసీఆర్ వెంటే ఉన్నారన్నారు. విద్యుత్ లో తెలంగాణ గుజరాత్ ను మించిపోయిందని జగదీష్ రెడ్డి వెల్లడించారు. టీఆర్ఎస్ వీడిన వాళ్లే నష్టపోతారని..టీఆర్ఎస్ కు ఏమీకాదని ధీమా వ్యక్తం చేశారు. .కొందరు శత్రువులు నాకు కూడా ఈటెల గతి పడుతుందని కలలు కంటున్నారు ..కలలో కూడా అది జరగదన్నారు. భూముల అమ్మకం తెలంగాణ అభివృద్ధి కోసమే నన్నారు.