Telugu Gateway
Telangana

తెలంగాణలో మధ్యంతర ఎన్నికలు..కెసీఆర్ జైలుకు

తెలంగాణలో మధ్యంతర ఎన్నికలు..కెసీఆర్ జైలుకు
X

జీహెచ్ఎంసీ ఎన్నికల వేళ తెలంగాణలో రాజకీయాలు ఎన్నడూలేని స్థాయిలో వేడిపుట్టిస్తున్నాయి. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత తెలంగాణలో మధ్యంతర ఎన్నికలు వస్తాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతే కాదు..అవినీతి కేసుల్లో సీఎం కెసీఆర్ జైలుకు వెళతారని అన్నారు. గ్రేటర్‌ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం సృష్టించబోతుందని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ఫలితాల తర్వాత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నిలబడదని, ఆ పార్టీ ఎమ్మెల్యేలు తిరుబాటు చేస్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం హైదరాబాద్‌కు కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా వస్తున్నారని.. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం జాగ్రత్త అని హెచ్చరించారు. కేంద్రం త్వరలోనే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ అవినీతిని బయటపెడుతుందన్నారు. తాను ఇంట్లో చెప్పే వచ్చానని.. చావుకు భయపడేది లేదన్నారు.

ట్యాంక్‌బండ్‌ విగ్రహాలను టచ్‌ చేస్తే కచ్చితంగా దారుసలాంను కూల్చేస్తామని మరోసారి బండి సంజయ్‌ హెచ్చరించారు. టీఆర్ఎస్ ఒక్కో డివిజన్‌కు 5 కోట్ల రూపాయలు ఇస్తోందని ఆరోపించారు. టీఆర్ఎస్ ఇచ్చే డబ్బులు తీసుకోండని ఓటర్లకు పిలుపునిచ్చారు. బీజేపీకి ఓటు వేయాలని అన్నారు. బండి సంజయ్ వ్యాఖ్యలపై ఎల్పీ స్టేడియంలో మంత్రులు ఈటెల రాజేందర్ , ఎర్రబెల్లి దయాకర్ రావులు స్పందించారు. ప్రజల తీర్పుతో ఎన్నికైన ప్రభుత్వాన్ని కూల్చటం ఎవరి వల్లా కాదని ఈటెల వ్యాఖ్యనించారు. బిజెపి ఇతర రాష్ట్రాల్లో ఇలాంటి ప్రయత్నాలు చేసింది అని..కానీ ఎంతో చైతన్యవంతమైన తెలంగాణ సమాజంలో అది జరగదు అన్నారు. ఎర్రబెల్లి దయాకర్ రావు అయితే బండి సంజయ్ కు మెంటల్ అని వ్యాఖ్యానించారు.

Next Story
Share it