Telugu Gateway
Telangana

మెఘా షెల్ కంపెనీ ఉద్యోగులు కూడా అంత సంప‌న్నులా?

మెఘా షెల్ కంపెనీ ఉద్యోగులు కూడా అంత  సంప‌న్నులా?
X

వాళ్లు ఐఏఎస్ కూతురి పెళ్ళి బిల్లులు కూడా క‌డ‌తారా?

కంపెనీ చెప్పిన‌ట్లు ఉద్యోగుల‌కు ల‌క్షల బిల్లులు చెల్లించే స్థాయి ఉంటుందా?

బిల్లులు తానే చెల్లిస్తే ర‌జ‌త్ కుమార్ వీటిని త‌న ఐటి ఖాతాల్లో చూపిస్తారా?

మెఘా, ర‌జ‌త్ కుమార్ బంధంలో స‌మాధానం లేని ప్ర‌శ్న‌లెన్నో!

మెఘా ఇంజ‌నీరింగ్. కొద్ది కాలం క్రితం ఐటి దాడుల్లో బోగస్ ఇన్వాయిస్ లు..భారీ ఎత్తున దొంగ లెక్క‌లు..న‌గ‌దు లావాదేవీల‌తో దొరికిపోయింది. ఈ గోల్ మాల్ వ్య‌వ‌హారం ఏకంగా 2000 కోట్ల రూపాయ‌ల వ‌ర‌కూ ఉన్న‌ట్లు అప్ప‌ట్లో వార్త‌లు వ‌చ్చాయి. త‌ర్వాత ఈ కేసు ఏమైందో ఎవ‌రికి తెలియ‌దు. ఇప్పుడు మ‌రోసారి మెఘా ఇంజ‌నీరింగ్, ఐఏఎస్ కూతురి పెళ్లి బిల్లుల చెల్లింపు విష‌యం ఒక‌టి వెలుగులోకి వ‌చ్చింది. తెలుగు రాష్ట్రాల్లో భారీ సాగునీటి ప్రాజెక్టు ఏదైనా స‌రే మెఘా చేయిదాటిపోదు. కంపెనీ వ‌ద్ద‌నుకుంటే త‌ప్ప‌. అలా ఉంది ప‌రిస్థితి. ఇది అంద‌రికీ తెలిసిన బ‌హిరంగ ర‌హ‌స్య‌మే. తాజాగా ద న్యూస్ మినిట్ వెబ్ సైట్ సంచ‌ల‌న క‌థ‌నాన్ని వెలుగులోకి తెచ్చింది. అదేంటి అంటే తెలంగాణ‌కు చెందిన నీటిపారుద‌ల శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి ర‌జ‌త్ కుమార్ కుమార్తె పెళ్ళి సంద‌ర్భంగా హైద‌రాబాద్ లోని అత్యంత ఖ‌రీదైన హోట‌ల్ లో జ‌రిగిన విందు,వైభోగాల ఖ‌ర్చును ప్ర‌ముఖ కంపెనీ అయిన మెఘా ఇంజ‌నీరింగ్ చెల్లించింద‌ని..దీని కోసం ఏకంగా షెల్ కంపెనీల‌ను ఉప‌యోగించింద‌ని సైట్ త‌న క‌థ‌నంలో పేర్కొంది. అయితే దీనిపై మెఘాతోపాటు ర‌జ‌త్ కుమార్ లు కూడా ఖండ‌న‌లు ఇచ్చారు. అయితే మెఘా కంపెనీ వివ‌ర‌ణ ఏ మాత్రం న‌మ్మ‌శ‌క్యంగా లేదు. అదేంటి అంటే కంపెనీ ఉద్యోగులు చేసిన లావాదేవీల‌తో త‌మ‌కేమీ సంబంధం అని. ఉద్యోగులు ఓ ఐఏఎస్ అదికారి కుమార్తె పెళ్లి ఖ‌ర్చుకు ఏకంగా 20 నుంచి 25 ల‌క్షలు ఖ‌ర్చు పెడ‌తారా?. పెడితే గిడితే మెఘాలో ఓ ఉన్న‌ధికారికి ఖ‌ర్చు పెట్టి ఏమైనా ప్రమోష‌న్..లేదా వేత‌నాల ప్ర‌యోజ‌నం పొందుదామ‌నుకుంటాడు. కానీ ప్ర‌భుత్వంలో ఓ సీనియ‌ర్ ఐఏఎస్ అధికారికి సొంత నిధులు అంత మొత్తంలో ఎలా ఖ‌ర్చు పెడ‌తారు?.

అస‌లు ఆ అవ‌స‌రం ఏ ఉద్యోగికి అయినా ఏమి ఉంటుంది. మెగా ఇంజ‌నీరింగ్ వివ‌ర‌ణ అస‌లు న‌మ్మ‌శ‌క్యంగా ఉందా? అంటే దొరికిన త‌ర్వాత ఉద్యోగుల పేరు చెప్పి త‌ప్పించుకుంటున్నార‌నే విష‌యం స్ప‌ష్టం అవుతోంది. అంతే కాదు..ఉద్యోగుల వ్య‌క్తిగ‌త విష‌యాలు కంపెనీకి ఏమి సంబందం అంటూ ప్ర‌శ్న‌లు వేస్తోంది. ఇదిలా ఉంటే ర‌జ‌త్ కుమార్ కూడా న్యూస్ మినిట్ క‌థ‌నాన్ని ఖండిస్తూ బిల్లులు అన్నీ తానే చెల్లించాన‌ని చెబుతున్నారు. ఆయన చెప్పిందే నిజం అయితే ఈ మొత్తం బిల్లుల వ్య‌వ‌హారం త‌న ఐటి వార్షిక రిట‌ర్న్స్ లో చూపిస్తారా?. ఓ ఐఏఎస్ అధికారి హోట‌ల్ గ‌దులు, ఫైవ్ స్టార్ ఆతిధ్యం కోసం ఖ‌రీదైన ప్రాంతం బుకింగ్ కోసం అధికారికంగా 25 ల‌క్షల ఖ‌ర్చు పెట్ట‌డం జ‌రిగే ప‌నేనా?. అయితే ఇది ఒక్క‌టే వెలుగులోకి వ‌చ్చింది. ఇలా వెలుగులోకి రాకుండా జ‌రిగే వ్య‌వ‌హారాలు ఎన్నో. ఐఏఎస్ అదికారుల కుటుంబ స‌భ్యుల పెళ్లిళ్ళే కాదు బీహార్ తోపాటు ఇత‌ర రాష్ట్రాల్లో ఐఏఎస్ లు క‌ట్టుకునే ఇళ్లు కూడా బ‌డా బ‌డా నిర్మాణ కంపెనీలే క‌ట్టించిపెడుతున్నాయి. వీటికి కూడా షెల్ కంపెనీల‌ను వాడ‌ట‌మే లేక ఇత‌ర మార్గాల్లోనే ప‌నులు కానిచ్చేస్తున్నారు. అంతే కాదు ఐఏఎస్ లు కోరుకునే అన్ని విలాసాల‌ను కూడా ప‌లు కంపెనీలు స‌మ‌కూరుస్తున్నాయి. ఈ విష‌యం కాంట్రాక్ట్ స‌ర్కిల్స్ తోపాటు ఐఏఎస్ వ‌ర్గాలు అంద‌రికీ తెలిసిన విష‌య‌మే.

న్యూస్ మినిట్ క‌థ‌నం సంక్షిప్తంగా..

హైదరాబాద్ లోని అగ్రశ్రేణి హోటళ్లలో విందులు, అత్యంత విలాసవంతమైన తాజ్ ఫలక్ నుమా పాలెస్ లో భారీ విందు. ఇటీవల జరిగిన తెలంగాణ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ కూతురు అంజలీ పెళ్లి అయిదురోజులపాటు అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వివాహపు ఖర్చులో ప్రధానమైన భాగాన్ని బిగ్ వేవ్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ అనే షెల్ కంపెనీ భరించిందని ది న్యూస్ మినిట్ పరిశోధనలో బ‌హిర్గ‌తం అయింది. ఆ కంపెనీ చిరునామా హైదరాబాద్ బ‌స్తీలోని బహదూర్ పురా ప్రాంతంలో ఉంది. ఆ ఐదు నక్షత్రాల పెళ్లి ఖర్చు భరించిన కంపెనీ రిజిస్టర్డ్ చిరునామా తన ఇల్లు ఎందుకయిందో కూడా అందులో ఉంటున్న మ‌హిళ‌కు తెలియదు. మరి ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని మూలం వెతుకుతూ పోగా ది న్యూస్ మినిట్ కు దొరికిన పత్రాల ప్రకారం హైదరాబాద్ లోని ఒక బడా ప్రభుత్వ కాంట్రాక్టర్ కంపెనీ ఉన్నతోద్యోగుల దగ్గరికి చేరాం. ఆ కంపెనీ పేరు మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్. 2021 డిసెంబర్ 17 నుంచి 21 దాకా అయిదు రోజుల పాటు అత్యంత విలాసవంతమైన ఎన్నో చోట్ల జరిగిన ఈ మహా వివాహ వేడుక‌లో ఆ ఉద్యోగులు సన్నిహితంగా పాల్గొన్నారని తెలిసింది.

మేఘా ఇంజనీరింగ్ అంటే తెలంగాణలో భారీగా నిర్మాణమవుతున్న కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కు సంబంధించిన చాల పనులు చేస్తున్న కాంట్రాక్టర్ కంపెనీ. ఆ ప్రాజెక్టు వ్యయం ప్రస్తుతానికి విపరీతమైన రు. ఒక లక్షా పదిహేను వేల కోట్ల రూపాయలుగా ఉంది. దేశం మొత్తంలో ఒక రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే ప్రాజెక్టుల్లోకెల్లా అత్యంత ఖరీదైనదిగా ఈ ప్రాజెక్టు పేరు పొందింది. ఇక్క‌డ చెప్పుకోదగిన విషయమేమంటే కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారాలను పర్యవేక్షించే రాష్ట్ర ప్రభుత్వ ఇరిగేషన్ అండ్ కమాండ్ ఏరియా డెవలప్ మెంట్ శాఖకు అధిపతిగా రజత్ కుమార్ పనిచేస్తున్నారు. వివాహానికి సంబంధించిన అనేక కార్యక్రమాలు జరిగిన, వివాహ అతిథులు బస చేసిన తాజ్ గ్రూప్ హోటళ్లయిన తాజ్ కృష్ణా, తాజ్ దక్కన్, తాజ్ ఫలక్ నుమా లను సంప్రదించడం, బుకింగ్ చేయడం, వివాహ సంరంభాల ఖర్చుల చెల్లింపులు జరపడం వంటి అన్ని పనులూ మేఘా ఉన్నతోద్యోగులే చేశారని ది న్యూస్ మినిట్ దగ్గర ఉన్న పత్రాలు వెల్లడిస్తున్నాయి.

Next Story
Share it