Telugu Gateway
Telangana

మా మంచి కంపెనీ ‘మేఘా’ ..ఇక ఇదే కాంగ్రెస్ నినాదమా!

మా మంచి కంపెనీ ‘మేఘా’ ..ఇక ఇదే కాంగ్రెస్ నినాదమా!
X

తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు తీసుకున్న తర్వాత తీసుకున్న అత్యుత్తమ నిర్ణయాల్లో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు ఒకటి. ఇప్పటి అవసరాలకు ఇది ఎంతో మంచి నిర్ణయం. దీని సారధ్య బాధ్యతలు మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా ను ఒప్పించటం మరో మంచి నిర్ణయం. ఇంత వరకు బాగానే ఉంది. తాగాగా తెలంగాణ సర్కారు తీసుకున్న ఈ నిర్ణయం తో రేవంత్ రెడ్డి సర్కారు కు వచ్చిన మంచి పేరు కాస్తా రివర్స్ అయ్యేలా ఉంది అనే చెప్పొచ్చు. మేఘా ఇంజినీరింగ్ కంపెనీ పై ఉన్న ఆరోపణలు అన్నీ ఇన్ని కావు. కాళేశ్వరం మోటార్ల స్కాం దగ్గర నుంచి ...సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలిపోవటం వరకు ఎన్నో విమర్శలు. ఎక్కడ వరకో ఎందుకు ఇదే రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉండగా పేరు పెట్టి మరీ మేఘా ఇంజనీరింగ్ కంపెనీపై చేసిన విమర్శలు అన్నీ ఇన్ని కావు. కానీ ఇప్పుడు అదే మేఘా కంపెనీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పక్కన చేరింది. దీంతో గత స్కాం లు ఇక వెలుగులోకి వస్తాయా..అది జరిగే పనేనా? అన్న అనుమానాలు తలెత్తటం సహజం. ప్రతి ఏటా లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టే తెలంగాణ ప్రభుత్వం దగ్గర ఇప్పుడు స్కిల్ యూనివర్సిటీ భవనాల నిర్మాణానికి రెండు వందల కోట్ల రూపాయలు లేవా?. ఇంత మంచి ప్రాజెక్ట్ కు ఇప్పటికే చాలా మంది విరాళాలు ఇస్తున్నారు. ఇటీవలే అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ కూడా వంద కోట్ల రూపాయలు అందించారు.

అదానీ మీద ఆరోపణలు లేవా అన్న ప్రశ్న ఉదయించవచ్చు. అయితే ఆ కంపెనీపై ఇప్పుడు మేఘా ఇంజనీరింగ్ పై ఉన్న అన్ని ఆరోపణలు తెలంగాణ లో అయితే లేవు అని చెప్పొచ్చు. ఇప్పటికే తన నిర్ణయాలతో పలు విమర్శలు ఎదుర్కొంటున్న రేవంత్ రెడ్డి సర్కారుకు ఎంతో మంచి పేరు తెచ్చిపెట్టే స్కిల్ యూనివర్సిటీ పనులను ఎంత సిఎస్ఆర్ కింద చేపట్టినా కూడా మేఘా ఇంజినీరింగ్ కి అప్పగించటం మాత్రం ఖచ్చితంగా విమర్శలు పాలు అయ్యే అవకాశం ఉంది. బిఆర్ఎస్ హయాంలో మేఘా ఇంజనీరింగ్ కంపెనీ కి వేల కోట్ల రూపాయల ప్రాజెక్ట్ లు ఇచ్చారు అని విమర్శించిన వాళ్ళు అంతా ఇప్పడు రెండు వందల కోట్ల రూపాయలు విరాళంగా ప్రకటించగానే ఆయన పక్కన ఫోటో లు దిగితే ప్రజలకు ఎలాంటి సంకేతం వెళుతుంది అన్నది చూడాలి. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ వ్యయం అంచనాల పెంపు విషయంలోనే మంత్రులు విమర్శలు గుప్పించారు. కానీ రేవంత్ రెడ్డి సర్కారు కానీ...మంత్రులు కానీ ఆ దిశగా ఆలోచిస్తున్నట్లు ఎక్కడా కనిపించటం లేదు అనే చెప్పొచ్చు. మేఘా ఇంజనీరింగ్ అధినేత కృష్ణా రెడ్డి అండ్ టీం శనివారం నాడు సీఎం రేవంత్ రెడ్డి తో సమావేశం అయిన తర్వాత ప్రభుత్వం నుంచి వచ్చిన ప్రకటన సారాంశం ఇది. ‘యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు ప్రక్రియలో మరో ముందడుగు పడింది. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నెలకొల్పిన స్కిల్స్ యూనివర్సిటీ భవన నిర్మాణానికి మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (MEIL) ముందుకొచ్చింది.

మొత్తం యూనివర్సిటీ క్యాంపస్ నిర్మాణానికి మెఘా కంపెనీ తమ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ నిధుల నుంచి రూ.200 కోట్లు కేటాయించింది. వీటితో యూనివర్సిటీ క్యాంపస్ లో అవసరమైన భవనాలన్నింటినీ నిర్మించే బాధ్యతలను స్వీకరించింది. ప్రపంచ స్థాయి అధునాతన నమూనాలతో అన్ని మౌలిక వసతులు ఉండేలా స్కిల్స్ యూనివర్సిటీ నిర్మాణం చేపట్టేందుకు కంపెనీ ముందుకు వచ్చింది. శనివారం సచివాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డితో మెఘా కంపెనీ ఎండీ కృష్ణారెడ్డి నేతృత్వంలో ఆ కంపెనీ ప్రతినిధుల బృందం సంప్రదింపులు జరిపింది. ముఖ్యమంత్రితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రభుత్వం తలపెట్టిన స్కిల్స్ యూనివర్సిటీ నిర్మాణంలో భాగస్వామ్యం పంచుకునేందుకు మెఘా కంపెనీ చర్చలు జరిపింది. ప్రపంచస్థాయి ప్రమాణాలతో స్కిల్స్ యూనివర్సిటీ క్యాంపస్ నిర్మాణం చేపడుతామని ప్రకటించింది. యూనివర్సిటీ భవనాల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) చేసుకుంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ వీఎల్వీఎస్ఎస్ సుబ్బారావు సమక్షంలో ఎంవోయూపై సంతకాలు చేశారు.

హైదరాబాద్ శివార్లలో కందుకూరు మండలంలో మీర్ ఖాన్ పేట సమీపంలో 57 ఎకరాల విస్తీర్ణంలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆగస్ట్ లోనే యూనివర్సిటీ నిర్మాణానికి భూమి పూజ చేశారు. అక్కడ అధునాతన బోధన సదుపాయాలతో పాటు విద్యార్థులకు అన్ని వసతులుండేలా క్యాంపస్ నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. సీఎస్ఆర్ నిధులతో ఈ క్యాంపస్ నిర్మాణానికి మెఘా కంపెనీ ముందుకు వచ్చినందుకు ముఖ్యమంత్రి అభినందనలు తెలిపారు. అకడమిక్ బిల్డింగ్, వర్క్ షాపులు, తరగతి గదులతో పాటు హాస్టల్ బిల్డింగ్ నిర్మిస్తామని మెఘా కంపెనీ ఎండీ కృష్ణారెడ్డి తెలిపారు. ఇప్పటికే ఆర్కిటెక్ట్ నిపుణులతో తయారు చేయించిన యూనివర్సిటీ భవన నిర్మాణ నమూనాలను, డిజైన్లను ఈ సమావేశంలో ప్రదర్శించారు. వారం రోజుల్లోగా భవన డిజైన్లకు తుది రూపు ఇవ్వాలని ముఖ్యమంత్రి సూచించారు. నవంబర్ 8వ తేదీ నుంచి యూనివర్సిటీ భవన నిర్మాణ పనులు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పారు. ప్రభుత్వం తరఫున అందుకు అవసరమైన సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు.’. సో ఇక తెలంగాణ సర్కారు కు మేఘా ఇంజనీరింగ్ కూడా తెల్లనైన పాల లాంటి స్వచ్ఛమైన కంపెనీగా మారిపోయినట్లే.

Next Story
Share it