Telugu Gateway
Telangana

మ‌ర్రి శ‌శిధ‌ర్ రెడ్డి కూడా మాట్లాడారు

మ‌ర్రి శ‌శిధ‌ర్ రెడ్డి కూడా మాట్లాడారు
X

తెలంగాణ‌లో కాంగ్రెస్ లో ర‌చ్చ ఆగ‌టం లేదు. ఒక‌రి త‌ర్వాత ఒక‌రు బ‌య‌టికి వ‌చ్చి పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, తెలంగాణ వ్య‌వ‌హారాల ఇన్ ఛార్జి మాణిక్యం ఠాకూర్ పై తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. తాజాగా సీనియ‌ర్ నేత మర్రి శ‌శిధ‌ర్ రెడ్డి చేసిన‌ వ్యాఖ్య‌లు మ‌రింత దుమారం రేపాయ‌ని చెప్పొచ్చు. కాంగ్రెస్ లో క‌ల్లోలానికి రేవంత్ రెడ్డే కార‌ణమ‌ని, రేవంత్ కు ఠాకూర్ ఏజెంట్ గా ప‌నిచేస్తున్నారంటూ తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. నిజానికి మ‌ర్రి శ‌శిధ‌ర్ రెడ్డికి కాంగ్రెస్ హైక‌మాండ్ తో మంచి సంబంధాలు ఉన్నాయి. ఇదే అంశంపై ఆయ‌న పిర్యాదు చేయ‌ద‌ల‌చుకుంటే కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీనో లేక రాహుల్ గాంధీనో క‌ల‌సి కూడా చెప్పొచ్చు. అలా కాకుండా ఆయ‌న మీడియా ముందుకు వ‌చ్చి తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. నిజానికి మ‌ర్రి శ‌శిధ‌ర్ రెడ్డి ఏడాదికో..రెండేళ్ళ‌కో బ‌య‌ట‌కు వ‌స్తారు. పార్టీ కార్య‌క్ర‌మాల్లో పెద్ద‌గా యాక్టివ్ గా పాల్గొనేది కూడా ఉండ‌దు. అంతే కాదు..ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గంలో కూడా పెద్ద‌గా ప‌ర్య‌టించ‌ర‌ని ఆ పార్టీ నేత‌లు చెబుతారు. కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్ విష‌యంలో త‌ప్పు అంతా రేవంత్ రెడ్డిదే అంటూ మ‌ర్రి శ‌శిధ‌ర్ రెడ్డి వ్యాఖ్యానించారు.

ఇదే కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి కొన్ని నెల‌ల క్రితం తెలంగాణ‌లో టీఆర్ఎస్ ను ఓడించేది బిజెపి మాత్ర‌మే అంటూ బ‌హిరంగంగా వ్యాఖ్యానించారు. అప్పుడు మాత్రం మ‌ర్రి శ‌శిధ‌ర్ రెడ్డికి త‌ప్పేమీ క‌న్పించ‌లేదు. కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉండి..పార్టీ ప్ర‌యోజ‌నాల‌ను దెబ్బ‌తీసేలా మాట్లాడినా కూడా ఇదే మ‌ర్రి శ‌శిధ‌ర్ రెడ్డి క‌నీసం ఒక ప్ర‌క‌ట‌న చేసింది..దీనిపై స్పందించింది లేదు. అంత మాత్రాన రేవంత్ రెడ్డి పార్టీ నాయ‌కుల గురించి..వాచ్ మేన్ వ్యాఖ్య‌ల‌ను స‌మ‌ర్ధిస్తున్న‌ట్లు కాదు. అస‌లు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ బ‌లోపేతానికి ఆయ‌న పాత్ర ఏమి ఉంది అని కూడా నాయ‌కులు ప్ర‌శ్నిస్తున్నారు. మీడియా ముందు మాట్లాడాల్సిన అంశాలు అన్నీ మాట్లాడి ఇప్పుడు మాత్రం సోనియాగాంధీ అపాయింట్ మెంట్ కోర‌టం అన్న‌ది విచిత్రంగా ఉంద‌నే అభిప్రాయం ఆ పార్టీ నేత‌ల్లో వ్య‌క్తం అవుతోంది. మ‌ర్రి శ‌శిధ‌ర్ రెడ్డితోపాటు కోమటిరెడ్డి వెంక‌ట‌రెడ్డి కూడా సోనియాగాంధీ అపాయింట్ మెంట్ కోరిన‌ట్లు స‌మాచారం. జ‌గ్గారెడ్డి వంటి నేత‌లు రేవంత్ పై విమ‌ర్శ‌లు చేసినా ఆయ‌న పార్టీలో, నియోజ‌క‌వ‌ర్గంలో యాక్టివ్ గా ఉంటారు. కానీ మ‌ర్రి శశిధ‌ర్ రెడ్డి ప‌రిస్థితి మాత్రం అందుకు భిన్నం. ఓ వైపు మ‌ర్రి శ‌శిధ‌ర్ రెడ్డి వ్య‌వ‌హారం ఇలా ఉంటే మ‌రో వైపు మాజీ ఎమ్మెల్యే మ‌హేశ్వ‌ర్ రెడ్డి కూడా అస‌మ్మ‌తి స్వ‌రం విన్పిస్తున్నారు.

Next Story
Share it