Telugu Gateway
Telangana

మహీంద్రా కె2 సిరీస్ ట్రాక్టర్ల తయారీ జహీరాబాద్ లో

మహీంద్రా కె2 సిరీస్ ట్రాక్టర్ల తయారీ జహీరాబాద్ లో
X

మహీంద్రా అండ్ మహీంద్రా (ఎంఅండ్ఎం) జహీరాబాద్ ప్లాంట్ లో కె2 సిరీస్ ట్రాక్టర్ల తయారీ చేయాలని నిర్ణయించింది. దీని కోసం అదనంగా వంద కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టనుంది. ఈ విషయాన్ని కంపెనీ మంగళవారం నాడు అధికారికంగా ప్రకటించింది. ఈ కె2 సిరీస్ ట్రాక్టర్ల తయారీ కోసం మహీంద్రా సంస్ధ జపాన్ కు చెందిన మిట్సుబిషి సంస్థతో కలిసి పరిశోధనలు నిర్వహించి, తక్కువ బరువుగల ట్రాక్టర్ల తయారీకి కార్యాచరణ రూపొందించినట్లు తెలిపింది. కే 2 ట్రాక్టర్ సిరీస్ ట్రాక్టర్లను దేశీయ మార్కెట్ లతోపాటు అమెరికా, జపాన్, సౌత్ ఈస్ట్ ఏషియా వంటి అంతర్జాతీయ మార్కెట్లోనూ విక్రయించనున్నట్లు వెల్లడించింది.

తాను రూపొందిస్తున్న ఈ కె2 సిరీస్ ద్వారా సుమారు 37 ఏడు రకాల మోడళ్లను తయారు చేసే అవకాశం ఉన్నదని కంపెనీ తెలిపింది. మిట్సుబిషి, మహీంద్రా భాగస్వామ్యంతో జహీరాబాద్ లో తయారు కానున్న ఈ ట్రాక్టర్లు కేవలం తెలంగాణకు మాత్రమే కాకుండా దేశానికి సంబంధించి కూడా తయారీ రంగంలో ఒక గొప్ప మైలురాయిగా నిలుస్తుందని ఈ సందర్భంగా తెలంగాణ పరిశ్రమలు, ఐటి శాఖల మంత్రి కేటీఆర్ అభిప్రాయపడ్డారు. తెలంగాణకి పదుల సంఖ్యలో భారీ నూతన పెట్టుబడులు రావడంతో పాటు తెలంగాణలో ఇప్పటికే కార్యకలాపాలు నిర్వహిస్తున్న సంస్థలు సైతం ఇక్కడి వ్యాపార అనుకూలత, అవకాశాలను దృష్టిలో పెట్టుకుని తమ పెట్టుబడులను విస్తరించడం పట్ల మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు.

Next Story
Share it