Telugu Gateway
Telangana

ఎయిర్ పోర్ట్ మెట్రో కు రెండు బిడ్స్

ఎయిర్ పోర్ట్ మెట్రో కు రెండు బిడ్స్
X

తెలంగాణ సర్కారు కొత్తగా ప్రతిపాదించిన ఎయిర్ పోర్ట్ మెట్రో ప్రాజెక్ట్ కు రెండు కీలక సంస్థలు బిడ్స్ దాఖలు చేశాయి. ఇందులో ఇప్పటికే హైదరాబాద్ లో మెట్రో నిర్వహిస్తున్న ఎల్ అండ్ టి తో పాటు ప్రముఖ నిర్మాణ సంస్థ ఎన్ సి సి కూడా బిడ్స్ దాఖలు చేసింది. రాయదుర్గం నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ వరకు 31 కిలోమీటర్ల మెట్రో ప్రాజెక్ట్ కు ప్రభుత్వం టెండర్లు పిలిచిన విషయం తెలిసిందే. ఇంజనీరింగ్, సేకరణ , నిర్మాణం (ఈపీసి) పద్ధతి లో ఈ ప్రాజెక్ట్ కోసం టెండర్లు పిలిచారు. ప్రాజెక్ట్ వ్యయం 5 688 కోట్ల రూపాయలుగా నిర్ణయించారు. పోటీలో ఉన్న రెండు సంస్థలు తమకున్న సామర్ధ్యాలను వెల్లడిస్తూ భారీ స్థాయిలో వివరాలు సమర్పించామని...వీటిని పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వటానికి పది రోజుల వరకు సమయం పట్టవచ్చు అని హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ మెట్రో లిమిటెడ్ (హెచ్ ఏ ఎం ఎల్ ) వెల్లడించింది.

రెండు సంస్థలు బ్యాంకు గ్యారంటీ ద్వారా ఒక్కొక్కటి 29 కోట్ల రూపాయల సెక్యూరిటీ డిపాజిట్ సమర్పించాయని తెలిపారు. సాంకేతిక నిపుణలతో కూడిన జనరల్ కన్సల్టెంట్స్ సైస్ట్రా టీం అన్ని విషయాలు మదింపు చేసి హెచ్ ఏ ఎం ఎల్ కు నివేదిక ఇస్తే...ఈ సంస్థ ప్రభుత్వానికి సిఫారసు చేస్తుంది. సాంకేతికంగా అర్హత సాధించిన కంపెనీల ఆర్థిక బిడ్స్ ఓపెన్ చేసి తుది బిడ్దర్ ను ఎంపిక చేస్తారు. ఎల్ అండ్ టి కు ఇప్పటికే మెట్రో ప్రాజెక్ట్ ల నిర్వహణ , నిర్మాణంలో అనుభవం ఉండగా, ప్రముఖ నిర్మాణ సంస్థ ఎన్ సి సి కూడా బరిలో నిలిచింది. ఈ సంస్థకు కూడా మెట్రో ప్రాజెక్ట్ లకు సంబంధించి ముఖ్యంగా ఈపీసి లో అనుభవం ఉంది.

Next Story
Share it