Telugu Gateway
Telangana

అంతా వాళ్ళిద్దరి వల్లే !

అంతా వాళ్ళిద్దరి వల్లే !
X

ఏ రాజకీయ పార్టీ కి అయినా..ప్రాజెక్ట్ కు అయినా పునాదులు ఎంతో ముఖ్యం. పునాదులు ఎంత బలంగా ఉంటే వాటి మనుగడ కూడా అంత సుదీర్ఘ కాలం ఉంటుంది. లక్ష కోట్ల రూపాయలు పెట్టి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ పునాదులు కదిలాయి. ఇప్పుడు అసలు అది ఎంత మేర పనికి వస్తుందో....పనికి వచ్చినా మళ్ళీ దీనికోసం ఇంకా ఎంత ఖర్చు పెట్టాలో తెలియని పరిస్థితి. తానే చెమట చిందించి... రక్తం కరిగించి కాళేశ్వరం డిజైన్ చేసినట్లు బిఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ బహిరంగంగానే చెప్పుకున్నారు. కెసిఆర్ అధికారంలో ఉండగానే ఇందులో లోపాలు బయటపడ్డా...అధికారాన్ని అడ్డంపెట్టుకుని అవి బయటకు రాకుండా చేసుకోగలిగారు. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో కెసిఆర్ ఓటమితో కాళేశ్వరం లోని అసలు సంగతులు బయటకు వచ్చాయి. కెసిఆర్ ఒక ఫెయిల్యూర్ ఇంజనీర్ అని తేలిపోయింది. ఇంజనీర్ కాకుండానే ప్రాజెక్ట్ ల డిజైన్లు చేస్తే ఎలా ఉంటదో ఇదో ఉదాహరణ. ఎన్ని విమర్శలు ఉన్నా తెలంగాణ సాధించిన పార్టీ గా ఒకప్పటి టిఆర్ ఎస్, ఇప్పటి బిఆర్ఎస్ తొమ్మిదిన్నర సంవత్సరాలు ఒక వెలుగు వెలిగింది. కానీ కాళేశ్వరం ప్రాజెక్ట్ తరహాలో బిఆర్ఎస్ పునాదులు ఎంత బలహీనంగా ఉన్నాయో ఆ పార్టీ ఓటమి తర్వాత ఇప్పుడు బయటపడుతోంది. అధికారంలో ఉన్న సమయంలో కెసిఆర్, కేటీఆర్ లు ఎంత పెద్ద లీడర్లను అయినా...ఎంత మంచి పేరు ఉన్న వాళ్ళను అయినా కూడా ఏ మాత్రం లెక్క చేయకుండా వ్యవహరించిన విధానం పార్టీ నేతలు అందరికీ తెలుసు.

అధికారంలోకి వచ్చిన తర్వాత బిఆర్ఎస్ రెండు టర్మ్స్ లోనూ రకరకాల ప్రలోభాలతో కాంగ్రెస్ , టీడీపీ నుంచి పెద్ద ఎత్తున నాయకులను తన వైపు తిప్పుకున్నది. వాళ్ళు అంతా కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళేమి కాదు. అటు కాంగ్రెస్ లో ఉన్నా...ఇటు టీడీపీ లో ఉన్నా వాళ్ళ వాళ్ళ పార్టీల్లో ఎంతో కొంత వాళ్ళ మాటకు విలువ ఉండేది. అధినేతలను కలిసి ఛాన్స్ ఉండేది. కానీ కెసిఆర్ మాత్రం మంత్రుల దగ్గర నుంచి ఎమ్మెల్యే ల వరకు అందరిని వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాలకు మాత్రమే పరిమితం చేశారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని చాలా మంది ఆర్థికంగా లాభపడి ఉండొచ్చు. ఆ వెసులుబాట్లు కెసిఆర్ కలిపించి ఉండొచ్చు. కానీ నాయకులుగా పార్టీ లో అటు కెసిఆర్ దగ్గర నుంచి..ఇటు కెటిఆర్ దగ్గర నుంచి కానీ వాళ్లకు కనీస గౌరవం దక్కలేదు అనే అభిప్రాయం బిఆర్ఎస్ నాయకుల్లో ఉంది. అవసరం ఉంటే తప్ప కెసిఆర్ అయినా...కేటీఆర్ అయినా ఏ ఒక్క నాయకుడితో ఎప్పుడూ ప్రేమతో మాట్లాడిన సందర్భం లేదు అని ఒక సీనియర్ నేత వ్యాఖ్యానించారు. సంవత్సరాల తరబడి పార్టీలో ఉన్నా అధినేతకు, నాయకుల మధ్య ఏ మాత్రం ఎమోషనల్ బాండింగ్ అన్నది పార్టీ లో ఎక్కడా కనపడదు అని అయన వ్యాఖ్యానించారు.

అందుకే అధికారంలో ఉన్నప్పుడు వచ్చిన వాళ్ళు ...అధికారం పోగానే వెళ్లిపోవటంలో పెద్ద వింత ఏమి ఉంది అని అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అటు కెసిఆర్ అయినా...ఇటు కేటీఆర్ అయినా తమను మోసం చేసి వెళ్లిపోయారు అని...తాము ఏమి తక్కువ చేశాం అనే డైలాగుల వల్ల ఇప్పుడు పెద్దగా ఉపయోగం ఉండదు అని...అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ఏమి చేశారో పార్టీ లో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు అని మరో నేత అభిప్రాయపడ్డారు. తాజాగా లోక్ సభ బరిలో నిలిచిన అభ్యర్థులు కూడా పార్టీ ని విడిచి పెట్టి పోవటంతో ఒక్కసారి గా బిఆర్ఎస్ లో కలకలం స్టార్ట్ అయింది. సీనియర్ నేత కడియం శ్రీహరి, అయన కూతురు డాక్టర్ కావ్య లు బిఆర్ఎస్ కు గుడ్ బై చెప్పాలని నిర్ణయం తీసుకున్నారు. మరో వైపు హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి కాంగ్రెస్ లో చేరగా, ఆమె తండ్రి, రాజ్య సభ సభ్యుడు కే. కేశవ రావు కూడా అదే బాటలో ఉన్నారు. పార్ల మెంట్ ఎన్నికల ముందు మరింత మంది బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్ లో చేరతారు అనే ప్రచారం ఉంది. లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నేతలు చెపుతున్నట్లు పది కి పైగా ఎంపీలను ఆ పార్టీ గెలుచుకుంటే ఎన్నికల తర్వాత మరింత మంది బిఆర్ఎస్ ను వీడటం ఖాయం అనే చర్చ కూడా సాగుతోంది.

దీంతో బిఆర్ఎస్ పునాదులు కదులుతున్నట్లు అవుతోంది. దీనికి ప్రధాన కారణం కెసిఆర్, కేటీఆర్ ల వ్యవహార శైలి...అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు అనుసరించిన విధానాలే అని పార్టీ నాయకులు చెపుతున్నారు. ప్రతిపక్షంలో ఉండగా పార్టీ మారే వాళ్ళను చెప్పుతో కొట్టాలి అని బహిరంగంగా వ్యాఖ్యానించిన కెసిఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమి చేశారో తెలంగాణ ప్రజలు అందరూ చూశారు. పార్టీ మారే వాళ్ళను రాళ్లతో కొట్టాలి అని గతంలో ప్రకటించిన ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు వేరే పార్టీ వాళ్ళను చేర్చుకునే పనిలో ఉన్నారు. కాంగ్రెస్ సర్కారు ను పడగొడతాం..పడగొడతాం అనే బిఆర్ఎస్ నాయకుల మాటలు కూడా ఈ ఫిరాయింపులకు కారణం అవుతున్నాయనే చర్చ ఉంది. తన ప్రభుత్వాన్ని పడగొట్టేవరకు వస్తే అప్పుడు తాను ఏంటో చూపిస్తాను అంటూ వ్యాఖ్యానించిన రేవంత్ రెడ్డి అంత కంటే ముందే బిఆర్ఎస్ ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకునే పనిలో ఉన్నారు. ఎన్నికల ముందు వరకు తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ ఉంటుందా అనే చర్చ సాగగా..ఇప్పుడు పునాదులు లేకుండా ఉన్న బిఆర్ఎస్ ఎలా నిలదొక్కుకుంటుందా అన్న చర్చ సాగుతోంది. తెలంగాణ లోని రేవంత్ సర్కారు ఒక వైపు అత్యంత వివాదాస్పదమైన కాళేశ్వరం ప్రాజెక్ట్ దగ్గర నుంచి గత బిఆర్ఎస్ చేపట్టిన పలు ప్రాజెక్ట్ లపై విచారణకు ఆదేశించింది. మరో వైపు టెలిఫోన్ ట్యాపింగ్ ఇప్పుడు మరింత సంచనలంగా మారింది. ఈ విచారణలు అన్ని పూర్తి అయ్యే నాటికి ఇంకెన్ని నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటాయో వేచిచూడాల్సిందే.

Next Story
Share it