ఎల్అండ్ టి లేఖ తో అసలు బండారం బట్టబయలు
లోక్ సభ ఎన్నికల ముందు బిఆర్ఎస్ ను ఇది మరింత ఇరకాటంలోకి నెట్టే పరిణామం. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలై ఉన్న ఆ పార్టీని రాబోయే రోజుల్లో పలు అంశాలు వెంటాడే అవకాశం ఉంది. అధికార కాంగ్రెస్ కూడా సరిగ్గా లోక్ సభ ఎన్నికల ముందు శ్వేత పత్రాలు విడుదల చేసి గత ప్రభుత్వ ‘ఘన’ కార్యాలను బహిర్గతం చేయబోతుంది. ఇప్పటికే ఒక్కో శాఖకు సంబదించిన అంశాలను బయటపెడుతున్నా రాబోయే రోజుల్లో సమగ్ర వివరాలను వెల్లడించనున్నారు. ఈ తరుణంలో ప్రముఖ నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టి తెలంగాణ సాగునీటి శాఖకు రాసిన లేఖ ఒకటి ఇప్పుడు పెద్ద సంచలనంగా మారింది. లక్ష కోట్ల రూపాయలకుపైగా ఖర్చు పెట్టి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భాగం అయిన మేడిగడ్డ పిల్లర్లు కుంగటం...బ్యారేజ్ కు క్రాక్ లు వచ్చిన విషయం తెలిసింది. ఇది అప్పటిలో పెద్ద సంచలనంగా మారగా బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ మాత్రం ఇది చాలా చిన్న విషయం అన్నట్లు మాట్లాడారు. అంతే కాదు...నిర్మాణ సంస్థే లోపాలను సరిదిద్దుతుంది అని...ప్రభుత్వంపై ఒక్క రూపాయి కూడా అదనపు భారం పడదు అంటూ చెప్పుకొచ్చారు. కెటిఆర్ తో పాటు సాగునీటి శాఖ అధికారులు కూడా ఇదే విషయం చెప్పారు. గతంలో కట్టిన ప్రాజెక్ట్ ల్లో కూడా లోపాలు బయటపడ్డాయని కేటీఆర్ ఎదురుదాడి చేశారు. ఎప్పుడో కట్టిన వాటిలో చిన్న చిన్న సమస్యలు రావటం వేరు...కట్టిన నాలుగేళ్లలోనే ఏకంగా ఏకంగా పిల్లర్లు కుంగటం, డ్యామ్ కు క్రాక్ లు రావటం అన్నది కేటీఆర్ చెప్పినట్లు చిన్న విషయం ఏమి కాదు. మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల్లో చోటు చేసుకున్న లోపాలపై రేవంత్ రెడ్డి సర్కారు విచారణకు సిద్ధం అవుతోంది. తాజాగా గవర్నర్ తమిళ్ సై కూడా అసెంబ్లీ లో ఈ విషయాన్నిమరో సారి స్పష్టం చేశారు.
ఈ తరుణంలో మేడిగడ్డ కట్టిన ఎల్ అండ్ టి సంస్థ ఈ ప్రాజెక్ట్ పునరుద్ధరణ తమ బాధ్యత కాదు అని...కొత్తగా ఏ పని చెప్పట్టాలన్నా కూడా అనుబంధ ఒప్పందం ఉండాలి...ఆ మేరకు చెల్లింపులు చేయాల్సిందే అని లేఖ రాసింది. ప్రభుత్వం ఇచ్చిన డిజైన్ ప్రకారం పని చేశాం అని....ఒప్పందంలో ఉన్న డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్ కూడా ముగిసిపోయింది అని స్పష్టం చేసింది. ఇక్కడ లోపాలు సరిచేయడానికి..కాఫర్ డ్యామ్ నిర్మాణానికి కలిపి మొత్తం దగ్గర దగ్గర 550 కోట్ల రూపాయల వరకు ఖర్చు అవుతుంది అని అంచనా వేశారు. మేడిగడ్డ లోపాలు బయటపడ్డ తర్వాత ప్రాజెక్ట్ ను సందర్శించిన నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఆథారిటీ అధికారులు కూడా డిజైన్ల లోపం కారణంగానే ఈ పరిస్థితి ఎదురైంది అని స్పష్టం చేసింది. అంతే కాదు..మేడిగడ్డ మళ్ళీ పునర్ నిర్మించాల్సి ఉంటుంది అని కూడా పేర్కొంది. ఆ రిపోర్ట్ పై కూడా కేటీఆర్ విమర్శలు గుప్పించారు. అది ఎన్ డిఎస్ ఏ రిపోర్ట్ కాదు..బీజేపీ సారథ్యంలోని ఎన్ డిఏ రిపోర్ట్ అంటూ ఎద్దేవా చేశారు. మరి ఇప్పుడు ఎల్ అండ్ టి లేఖ విషయంపై కేటీఆర్ ఏమి చెపుతారో చూడాలి. ఈ పరిణామాలు అన్ని చూస్తుంటే అధికారం పోవటమే కాదు...అధికారంలో ఉన్నప్పుడు చేసిన వ్యవహారాలు అన్నీ కూడా ఒక్కోక్కటిగా బయటకు రాబోతున్నాయి. నిర్మాణ వైఫల్యాల కారణంగా మేడిగడ్డ లో జరిగిన వందల కోట్ల నష్టం ఒకెత్తు అయితే..ఇక్కడ నీటి నిల్వను నిలిపివేయటం వల్ల కాళేశ్వరం ప్రాజెక్ట్ అసలు లక్ష్యం దెబ్బతిని రైతులకు సాగునీరు అందకుండా పోతుంది అని చెప్పుతున్నారు.