రేవంత్ రెడ్డి రివర్స్ గేర్!

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహరించిన తీరు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ లో తీవ్ర దుమారం రేపుతోంది. ముఖ్యంగా సభ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనలు ప్రజల్లో ఎన్నో అనుమానాలకు కారణం అవుతున్నాయి. అదే సమయంలో ప్రభుత్వ పరువు కూడా తీసేలా ఉన్నాయనే చర్చ కూడా సాగుతోంది. కొంత మంది మంత్రులు కూడా అసెంబ్లీ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించిన తీరును తప్పుపడుతున్నారు. బిఆర్ఎస్ శాసనసభా పక్ష ఉప నేత, మాజీ మంత్రి హరీష్ రావు ఫ్యామిలీ ధరణి ని అడ్డంపెట్టుకుని మహబూబ్ నగర్ జిల్లాలో వందల ఎకరాలు అక్రమంగా బదలాయించుకున్నారు అని అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి ఆరోపించారు. దీనికి సంబంధించిన రికార్డు లు కూడా ఉన్నాయి అని అంటూ...హరీష్ రావు అంగీకరిస్తే దీనిపై సభా సంఘం వేయటానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. వందల ఎకరాల భూములు అక్రమంగా బదలాయించుకున్న విషయానికి పక్కాగా సాక్షాలు ఉన్నాయి అని చెప్పి కూడా సీఎం రేవంత్ రెడ్డి సభా సంఘం విషయాన్ని మర్చిపోయారు.
ఇక్కడ మరో కీలక విషయం ఏమిటి అంటే కొంత మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో పాటు...బిఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ వైపు వెళ్లిన వాళ్ళు కూడా ఈ అంశంపై సభా సంఘం వేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అయినా సరే సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయంలో మౌనాన్ని ఆశ్రయించటం పలు అనుమానాలకు తావిస్తోంది. ప్రభుత్వ ప్రతిష్టను కూడా మంట కలుపుతోంది అని ఒక మంత్రి వ్యాఖ్యానించారు. ఒక వైపు ఆధారాలు ఉన్నాయని సభలో సీఎం రేవంత్ రెడ్డి చెపుతూ హరీష్ రావు ఇందుకు ఓకే అంటే సభా సంఘం వేస్తానని ప్రకటించటంపైనే కాంగ్రెస్ నేతలు అవాక్కు అయ్యారు. ఇదే అంశంపై అసెంబ్లీ బయట మాట్లాడిన హరీష్ రావు తన కుటుంబ సభ్యుల పై వచ్చిన ఆరోపణలపై విచారణకు తాను సిద్ధం అని..సీఎం రేవంత్ రెడ్డి తమ్ముడు, బావమరిదిపై వచ్చిన ఆరోపణలపై విచారణకు సీఎం సిద్ధంగా ఉన్నారా అంటూ హరీష్ రావు సవాల్ విసిరారు.
కారణాలు ఏమైనా కానీ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన అంశంలో సీఎం రేవంత్ రెడ్డి సభా సంఘం విషయాన్ని పూర్తిగా మర్చిపోవటంతో ఈ అనుమానాలు మరింత బలోపేతం అవుతున్నాయి. బిఆర్ ఎస్ హయాంలో సాగిన స్కాం లకు సంబంధించిన విషయాల్లో కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్క అంశంలో చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. దీనికి ప్రధాన కారణం తెర వెనక జరుగుతున్న వ్యవహారాలే అని కాంగ్రెస్ నేతలు చెపుతున్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెందిన అక్రమ మైనింగ్ వ్యవహారంపై బిఆర్ఎస్ సభలో ఆందోళన చేయగా....మంత్రి కంపెనీతో పాటు బిఆర్ఎస్ హయాంలో సాగిన అక్రమ మైనింగ్, ఇసుక అక్రమాలపై కూడా సీబీసీఐడీ విచారణ జరిపిస్తాం అంటూ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇన్ని రోజులు ఈ విషయంలో మౌనంగా ఉండి మంత్రి పొంగులేటి కంపెనీ వ్యవహారం బయటపడిన తర్వాత సీఎం ఇప్పుడు విచారణకు ఆదేశించటం కూడా పలు అనుమానాలకు తావిస్తోంది.



