Telugu Gateway
Telangana

మంత్రి ఈటెల రాజేందర్ పై భూ కబ్జా ఆరోపణలు

మంత్రి ఈటెల రాజేందర్ పై భూ కబ్జా ఆరోపణలు
X

ఈటెల రాజేందర్. తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి. గత కొంత కాలంగా 'స్వరం' మారింది. రకరకాల వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో వ్యక్తిగా నిలుస్తున్నారు. ముఖ్యంగా అధికార పార్టీకి కొరకరాని కొయ్యగా మారారనే అభిప్రాయం ఉంది. ఈ తరుణంలో అకస్మాత్తుగా ఆయనపై అసైన్ మెంట్ భూముల కబ్జా ఆరోపణలు వచ్చాయి. విచిత్రం ఏమిటంటే రెండు ప్రధాన ఛానళ్లు ఒకే సమయంలో ఈ భూ కబ్జా వార్తలను ప్రస్తారం చేశాయి. ఈ అసైనీదారులు స్వయంగా ముఖ్యమంత్రి కెసీఆర్ తోపాటు సీఎస్ సోమేష్ కుమార్ కు మరికొంత మందికి కూడా ఈటెల రాజేందర్, ఆయన అనుచరులపై పిర్యాదు చేశారు. సహజంగా ఏ మీడియా అయినా కబ్జా వార్తలు పక్కా ఆధారాలతో ప్రసారం చేసినా...అధికారికంగా స్పందించటానికి ప్రభుత్వంలో ఉన్న అధికారులు అంతగా సుముఖత చూపరు. కానీ మంత్రి ఈటెల విషయంలో మాత్రం అందుకు భిన్నంగా వారంతా మీడియా ముందుకు వచ్చి స్వయంగా ఓ మంత్రిపై వచ్చిన ఆరోపణలు నిజమే అని నిర్ధారించారు.

అంతే కాదు..నిబంధనలకు వ్యతిరేకంగా కబ్జా చేసిన అసైన్ మెంట్ భూములను రిజిస్టర్ చేయాలని ఒత్తిడి చేశారని...అందుకు తాము తిరస్కరించినట్లు తెలిపారు. జమున హ్యాచరీస్ కోసం ఈ భూములను కబ్జా చేశారని మంత్రిపై ఆరోపణలు వస్తున్నాయి. అంతే కాదు..అసైనీదారులు పదుల సంఖ్యలో వచ్చి ఈ రెండు ఛానళ్ళ ముందు మంత్రిపై ఫిర్యాదు చేశారు. ఒకే సారి..ఒకే సమయంలో రెండు ఛానళ్ళలో సేమ్ స్క్రిప్ట్..సేమ్ స్టోరీ ప్రసారం కావటంతో ఇది అంతా పక్కా ప్లాన్ ప్రకారమే సాగిందని టీఆర్ఎస్ వర్గాలు కూడా అంచనాకు వస్తున్నాయి. మరి ఈ కబ్జా ఆరోపణలపై మంత్రి ఈటెల ఎలా స్పందిస్తారో వేచిచూడాల్సిందే. వంద ఎకరాల మేర ఈటెల తన అనుచరులతో కబ్జా చేయించారని ఆ ఛానళ్ళు ప్రసారం చేశాయి

.

Next Story
Share it