కెటిఆర్ ట్వీట్ కు ఐదు నెలలు
మరో పదిహేను రోజులు పోతే తెలంగాణ మంత్రి కెటిఆర్ చేసిన ట్వీట్ కు ఐదు నెలలు వస్తాయి. ఆయనే తన ట్వీట్ లో ఇది దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న సమస్య అని ప్రస్తావించారు. దీర్ఘకాలం అంటే అంత ఇంతా కాదు ఏకంగా 14 ఏళ్లకు పైనే. ఎట్టకేలకు గత ఏడాది ఆగస్టులో అప్పటి సుప్రీమ్ కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి ఎన్ వీ రమణ జర్నలిస్ట్ ల కేసు ను క్లియర్ చేసి వాళ్లకు కేటాయించిన భూమిని వారికి వెంటనే ఇవ్వటంతో పాటు ఇళ్ల నిర్మాణానికి కూడా అనుమతి మంజూరు చేశారు. తీర్పు వచ్చిన వెంటనే బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటిఆర్ ట్వీట్ చేస్తూ తాము జర్నలిస్టులకు ఇచ్చిన హామీని నెరవేర్చటానికి ఇది ఎంతో దోహద పడుతుంది అని అందులో పేర్కొన్నారు. అంతే కాదు...తీర్పు ఇచ్చిన ప్రధాన న్యాయమూర్తికి కూడా ధన్యవాదాలు తెలిపారు ముఖ్యమంత్రి కెసిఆర్ కూడా పలు సందర్భాల్లో కోర్ట్ క్లియర్ చేయటం ఆలస్యం వెంటనే నిర్ణయం తీసుకుంటా అని ప్రకటించారు.
సుప్రీమ్ జడ్జిమెంట్ వచ్చిన ఐదు నెలలు కావస్తున్నా అటు సీఎం కెసిఆర్ కానీ...దీనిపై వెంటనే ట్వీట్ చేసిన మంత్రి కెటిఆర్ కానీ ఇంతవరకు స్పందించటంలేదు. పైగా అందరు అసలు తమకు ఏమి తెలియదు అన్నట్లు వ్యవహరిస్తున్నారు. తీర్పు వచ్చిన వెంటనే సీఎం కెసిఆర్ ఫోటోలకు పాలాభిషేకాలు చేసిన జర్నలిస్ట్ నాయకులు కూడా ఇళ్ల స్థలాల విషయం తప్ప అన్ని మాట్లాడుతున్నారు. ఇప్పటికే గత ప్రభుత్వం కేటాయించిన భూమి ఇవ్వటం లేదు ప్రభుత్వం...కొత్తగా ఇవ్వాల్సిన వాళ్ళ విషయంలోనే నోరు మెదపటంలేదు. దీంతో గత 14 ఏళ్లుగా కోట్ల రూపాయలు కట్టి ఎదురుచూస్తున్న వాళ్ళు విస్మయానికి గురి అవుతున్నారు. ప్రభుత్వంలోని కీలక అధికారులు కూడా జర్నలిస్టులతో ప్రభుత్వం ఇంత దారుణంగా వ్యవరిస్తున్న తీరు చూసి విస్మయం వ్యక్తం చేస్తున్నారు.