హుజూరాబాద్ ఎన్నికకు అంత ప్రాధాన్యత లేదు
హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితంపై తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటీఆర్ స్పందించారు. ఈ ఒక్క ఎన్నిక ఫలితానికి అంత ప్రాదాన్యత లేదని..దీని పర్యవసానాలు ఏమీ ఉండవన్నారు. గత 20 సంవత్సరాలుగా టీఆర్ఎస్ ఎన్నో ఎత్తుపల్లాలు చూసిందని అన్నారు. ట్విట్టర్ ద్వారా కెటీఆర్ ఈ ఎన్నిక ఫలితంపై స్పందించారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో స్పూర్తిదాయక పోరాటం చేసిన గెల్లు శ్రీనివాసయాదవ్ కు అభినందనలు తెలిపారు. మరింత బలమైన సంకల్సంతో టీఆర్ఎస్ కార్యకర్తలు భవిష్యత్ పోరాటాలకు సిద్ధం కావాలన్నారు.
ఈ ఉప ఎన్నిక కోసం అలుపెరగకుండా శ్రమించిన మంత్రులు హరీష్ రావు, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్ , ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ నేతలకు ధన్యవాదాలు తెలిపారు. పార్టీ తరపున ప్రచారం నిర్వహించిన సోషల్ మీడియా వారియర్స్ కూడా కృతజ్ఞతలు తెలిపారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాసయాదవ్ పై ఈటెల రాజేందర్ 24 వేల భారీ మెజారిటీతో విజయం సాధించిన విషయం తెలిసిందే. అత్యంత ఉత్కంఠ భరితంగా సాగిన ఈ ఎన్నికలో ఈటెల రాజేందర్ తొలి నుంచి ఆధిక్యత కనపర్చారు.