Telugu Gateway
Telangana

కెసిఆర్ మదిలో కొత్త ఆలోచన !

కెసిఆర్ మదిలో కొత్త ఆలోచన !
X

గ్రామీణ ప్రాంతాల్లో పార్టీ పునర్నిర్మాణం కోసం

పల్లెల్లో కేటీఆర్ తో పనికాదని కెసిఆర్ అంచనా...అందుకే హరీష్ కు బాధ్యతలు!

ఒకప్పుడు కెసిఆర్ నినాదం తెలంగాణ పునర్నిర్మాణం. కానీ ఇప్పుడు అయన గ్రామీణ ప్రాంతాల్లో పార్టీ ని ఎలా పునర్నిర్మించాలి..ఇందుకు చేపట్టాల్సిన చర్యలపై తర్జన భర్జనలు పడుతున్నారు. కెసిఆర్ ఇప్పుడు ప్రదానంగా తన దృష్టి అంతా దీనిపైనే పెట్టినట్లు బిఆర్ఎస్ లోని విశ్వసనీయ వర్గాలు చెపుతున్నాయి. 119 అసెంబ్లీ సీట్లు ఉన్న తెలంగాణాలో బిఆర్ఎస్ ఇప్పుడు 39 సీట్లతో బలమైన ప్రతిపక్షంగానే ఉంది. కానీ లోక్ సభ ఎన్నికల తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో పరిణామాలు వేగంగా మారే అవకాశం ఉంది అనే చర్చ సాగుతోంది. అధికారంలో లేకుండా పార్టీ ని నిలబెట్టడం అంటే అది ఆషామాషీ వ్యవహారం ఏమి కాదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరి ప్రయోజనాలు వాళ్లే చూసుకుంటున్నారు తప్ప పెద్దగా లాయల్టీస్ కూడా ఏమి ఉండటం లేదు. బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ కూడా తెలంగాణ లో ఇక తనకు తిరుగు ఉండకూడదు అనుకుంటూ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలుగు దేశం పార్టీ ని పూర్తి గా దెబ్బతీశారు..కాంగ్రెస్ ను కూడా కకావికలం చేసిన విషయం తెలిసిందే. గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ కి పట్టు , ఓటు బ్యాంకు ఉండబట్టే కెసిఆర్ ఎంత మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను రకరకాల ప్రలోభాలతో తన వైపు తిప్పుకున్నా మొన్నటి ఎన్నికల్లో తిరిగి నిలబడి పార్టీ అధికారంలోకి రాగలిగింది. ఇప్పుడు పలు జిల్లాల్లో వివిధ పదవుల్లో ఉన్న బిఆర్ఎస్ వాళ్ళు కూడా అధికార కాంగ్రెస్ వైపు మళ్ళుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. బిఆర్ఎస్ కు వచ్చిన 39 సీట్లలో మెజారిటీ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే అనే విషయం తెలిసిందే. ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో బిఆర్ఎస్ ఇప్పుడు ఒక్కో సీటు మాత్రమే దక్కించుకుంది. ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, మహబూబ్ నగర్ జిల్లాల్లో రెండేసి సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. దీంతో గ్రామీణ ప్రాంతాలపై దృష్టి పెట్టకపోతే పార్టీ కి గడ్డుపరిస్థితులు తప్పవని యోచిస్తున్న బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ ఈ మార్పుల దిశగా యోచిస్తున్నట్లు చెపుతున్నారు.

ప్రస్తుత బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అధికారంలో ఉన్నంత కాలం జిల్లాల్లో ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనటం తప్ప..ఏ రోజు కూడా జిల్లాల నేతలతో పార్టీ గురించి సమావేశం అయింది లేదు అని...పార్టీ నాయకులు అడిగినా కూడా అపాయింట్ మెంట్ లు ఇచ్చిన దాఖలాలు లేవు అని ఒక సీనియర్ నేత వెల్లడించారు. కేటీఆర్ స్టైల్ అఫ్ వర్కింగ్ పట్టణ ప్రాంత ప్రజలకు నచ్చ వచ్చు కానీ..గ్రామీణ ప్రాంత రాజకీయాలకు ఆయన విధానం ఏ మాత్రం సెట్ కాదు అని అయన అభిప్రాయపడ్డారు. అందుకే ఇప్పుడు మళ్ళీ హరీష్ రావు కు ఈ బాధ్యతలు అప్పగించి...ఆయన్ను పూర్తిగా పార్టీ పనిలో భాగస్వామ్యం చేయాలని..అందుకే హరీష్ కు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వాలనే ఆలోచనలో కెసిఆర్ ఉన్నట్లు బిఆర్ఎస్ వర్గాల్లో బలంగా ప్రచారం జరుగుతోంది. కెసిఆర్ ప్రతిపక్ష నేతగా కొనసాగుతూ కేటీఆర్ ను లోక్ సభ బరిలో నిలిపితే ఇక్కడ పార్టీ పని విషయంలో కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడవచ్చన్నది కెసిఆర్ ఆలోచనగా ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి కెసిఆర్ లోక్ సభ బరిలో ఉంటారు అనే ప్రచారం ఉన్నా...ఆయన బదులు కేటీఆర్ ను దింపే అవకాశం ఉంది అని చెపుతున్నారు. కేటీఆర్ ఎంత సేపు ట్విట్టర్ వేదికగా రాజకీయం చేస్తే సరిపోదు అని...జిల్లాల నేతలు...కీలక క్యాడర్ తో సమావేశం కాకుండా పార్టీ నడపటం కుదిరే పని కాదు అని మరో నేత అభిప్రాయపడ్డారు. అయితే కేటీఆర్ ను ఎక్కడ నుంచి లోక్ సభ బరిలో నిలుపుతారు...హరీష్ కు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి వంటి వాటిపై కెసిఆర్ నిర్ణయాలు వెలువడటానికి కొంత సమయం పెట్టె అవకాశం ఉంది అని చెపుతున్నారు. జనవరి 3 నుంచి లోక్ సభ నియోజకవర్గాల వారీగా సమీక్ష చేయనున్నట్లు కేటీఆర్ ఇప్పటికే ప్రకటించారు. కెసిఆర్ తన ఆలోచనలను ఈ సమీక్షల తర్వాత అమలు చేస్తారా..లేక ఇంకా కొంత సమయం తీసుకుంటారా అన్నది వేచిచూడాలి.

Next Story
Share it