Telugu Gateway
Telangana

ఇక్కడ ఇలా...అక్కడ అలా

ఇక్కడ ఇలా...అక్కడ అలా
X

మాటలు కోటలు దాటేలా చెప్పటంలో బిఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్, అయన తనయుడు, మంత్రి కెటిఆర్ లు ఎవరు ముందు అంటే చెప్పటం కష్టమే. తాజాగా మంత్రి కెటిఆర్ అమెరికా లో ని నెవడాలో ప్రపంచ పర్యావరణ, నీటి వనరుల సదస్సులో కీలక ప్రసంగం చేశారు. ఏకంగా అక్కడ అయన ప్రపంచానికే తెలంగాణ నీటి పాఠాలు చెపుతోంది అని ప్రకటించారు. ఇది చూస్తే చాలు కెటిఆర్ మాటలు ఎలా ఉన్నాయో చెప్పటానికి. ఒక వైపు అమెరికాలో కాళేశ్వరం, మిషన్ భగీరథ లు తెలంగాణ ప్రభుత్వ విజయాలుగా చెప్పుకున్నారు. ఒక వైపు ప్రపంచ పర్యావరణ, నీటి వనరుల సదస్సులో గొప్పలు చెప్పుకుంటూ తెలంగాణకు గుండెకాయ వంటి హైదరాబాద్ నగరంలో 111 జీఓ రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం రాబోయే రోజుల్లో నగరానికి ఎంత పెద్ద ముప్పును తీసుకు రాబోతోంది అనే విషయాన్నీ విస్మరించారు అని అధికారులు చెపుతున్నారు. నగరం పెరుగుతూ పోతున్న సమయంలో చెరువులు కూడా పూడ్చేసి రియల్ ఎస్టేట్ వెంచర్ లు వేసి ఇల్లు...అపార్ట్ మెంట్ లు కట్టడంతో భారీ వర్షాలు కురిసిన సమయంలో ప్రజలు ఎంతో ఇబ్బందులు పడ్డ విషయం అందరికి తెలిసిందే. గత అనుభవాలను ఏ మాత్రం పట్టించుకోకుండా ఇప్పుడు కెసిఆర్ సర్కారు ఏకంగా 111 జీ ఓ పరిధిలో హెచ్ఎండీఏ పరిధిలో ఎలా అయితే అనుమతులు ఇస్తున్నామో అక్కడ కూడా అలాగే ఇవ్వాలని తాజాగా మంత్రి వర్గ సమావేశంలో నిర్ణయం తీసుకుంది. . ఇప్పుడు వాతావరంలో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఎప్పుడు ఎలాంటి వాతావరణ ఉపద్రవాలు వస్తాయో ఊహించటం కూడా కష్టంగా ఉంది.

అలాంటి సమయంలో ఆచితూచి వ్యవహరించాల్సిన సర్కారు అందుకు బిన్నంగా వ్యాపార ప్రయోజనాల కోణంలో నిర్ణయం తీసుకుని ప్రజల భద్రత, వరదల ముప్పును విస్మరిస్తోంది అని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తొలుత అధికారులు ప్రతిపాదించిన గ్రీన్ జోన్ లు ఏమి లేకుండా...గ్రీన్ సిటీ కాన్సెప్ట్ కు కూడా మంగళం పాడి మొత్తం భూమిని రియల్ ఎస్టేట్ అవసరాలకు వాడుకునే వెసులుబాటు కల్పించటం అంటే ఇది నగరానికి పెద్ద ప్రమాదాన్ని తెచ్చి పెట్టడమే అని నిపుణులు చెపుతున్నారు. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ లు కలుషితం కాకుండా ఆపుతాం అని ప్రభుత్వం చెపుతున్నా...ఆ ప్రాంతంలో నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన తర్వాత అది ఎంత మేర సాధ్యం అవుతుంది అన్నది అందరికి తెలిసిందే. 111 జీఓ పరిధి లో భూములు సింహభాగం అధికార పార్టీ నేతలకే ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ముందు గ్రీన్ సిటీ మోడల్ తో ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని తలపెట్టారు. ఇందులో భూమి పూర్తి స్థాయి వినియోగం కాకుండా పరిమితులు పెట్టాలని నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు. కానీ ఇప్పుడు భూమి ఎక్కువ భాగం అధికార పార్టీ నేతల చేతుల్లోకి పోవటంతో ప్లాన్స్ మర్చి ఎంత వీలు అయితే అంత ఆర్థిక ప్రయోజనం పొందటమే టార్గెట్ గా ప్రణాళికలు తెరపైకి వచ్చాయని చెపుతున్నారు. ఇదే అమలు అయితే తర్వాత నష్టపోయేది ప్రజలు..నగరమే తప్ప నేతలకు ఏమి కాదు అని ఒక ఐఏఎస్ అధికారి వ్యాఖ్యానించారు.



Next Story
Share it