Telugu Gateway
Telangana

కాంగ్రెస్ ట్విట్ట‌ర్ ఖాతాను బ్లాక్ చేసిన కెటీఆర్

కాంగ్రెస్ ట్విట్ట‌ర్ ఖాతాను బ్లాక్ చేసిన కెటీఆర్
X

రాహుల్ ప‌ర్య‌ట‌న‌పై మంత్రి ట్వీట్..ఘాటుగా రిప్ల‌య్ ఇచ్చిన రేవంత్

ఆ త‌ర్వాతే కాంగ్రెస్ ఖాతాను బ్లాక్ చేసిన మంత్రి!

తెలంగాణ రాష్ట్ర స‌మితి (టీఆర్ఎస్) వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటీఆర్ అంద‌రిపై ట్విట్ట‌ర్ లో విమ‌ర్శ‌లు చేస్తుంటారు. ప్ర‌ధాని మోడీ ద‌గ్గ‌ర నుంచి బిజెపి, కాంగ్రెస్ నేత‌ల‌పై విమ‌ర్శ‌లు ఎక్కుపెడుతుంటారు. ప్ర‌భుత్వానికి అనుకూలంగా ఉన్న అంశాల‌పై మాత్రం వెంట‌నే ట్విట్ట‌ర్ లో అత్యంత వేగంగా స్పందిస్తారు. ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా ఉన్న అంశాలు...ప్ర‌భుత్వాన్ని ఇబ్బంది పెట్టే అంశాలు అయితే అస‌లు అటువైపే చూడ‌రు. నిత్యం ప‌లు అంశాల‌పై ట్విట్ట‌ర్ ను ఉప‌యోగించే మంత్రి కెటీఆర్ ఆక‌స్మాత్తుగా కాంగ్రెస్ పార్టీని ట్విట్ట‌ర్ లో బ్లాక్ చేశారు. ఈ విష‌యాన్ని తెలంగాణ కాంగ్రెస్ ట్వీట్ ద్వారా తెలియ‌జేసింది అదే స‌మ‌యంలో ఆయ‌న‌పై వ్యంగాస్త్రాలు సంధించింది.

'ట్విట్టర్ పిట్ట తోకముడిచింది. ప్రశ్నను చూసి గజగజ వణికింది. ప్రజల తరపున అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక తెలంగాణ కాంగ్రెస్ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ను కేటీఆర్ బ్లాక్ చేశారు. ఒక జాతీయ పార్టీ ట్విట్టర్ హ్యాండిల్ ను బ్లాక్ చేయడం కేటీఆర్ మానసిక స్థితికి అద్దం పడుతోంది.' అంటూ అందులో పేర్కొన్నారు. గ‌త కొన్ని రోజులుగా టీఆర్ఎస్ నేత‌లు బ‌హిరంగంగా..ట్విట్ట‌ర్ ద్వారా కాంగ్రెస్ నేత రాహుల్ ప‌ర్య‌ట‌న‌పై విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ఇప్పుడు కెటీఆర్ కాంగ్రెస్ ట్విట్ట‌ర్ ఖాతాను బ్లాక్ చేయ‌టం చ‌ర్చ‌నీయంశంగా మారింది.

అయితే అంతకు ముందు కెటీఆర్ తెలంగాణ‌లోని వ‌రంగ‌ల్ జిల్లాలో త‌ల‌పెట్టిన రాహుల్ ప‌ర్య‌ట‌న‌పై ట్వీట్ చేశారు. తెలంగాణ‌లో అమ‌లు అవుతున్న అత్యుత్త‌మ వ్య‌వ‌సాయ విధానాల‌ను ప‌రిశీలించి..కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు, విఫ‌ల రాష్ట్రాల్లో వీటిని అమ‌లు చేస్తారంటూ పేర్కొన్నారు. దీనికి టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కూడా అంతే ఘాటుగా కౌంట‌ర్ ఇచ్చారు. ' మీ పాలన పై ఏం అధ్యయనం చేయాలి కేటీఆర్!. రుణమాఫీ హామీ ఎలా ఎగగొట్టాలి?. ఎరువుల ఫ్రీ హామీని ఎలా అటకెక్కించాలి? మోడీ ముందు మోకరిల్లి తెలంగాణ రైతులకు ఉరితాళ్లు ఎలాబిగించాలి?. వరి,మిర్చీ,పత్తి రైతులు ఎలా చస్తున్నారు? ఇవే కదా నిజాలు. ఆ నిజాలు మరింత గట్టిగా చెప్పాడానికే రాహుల్ వస్తున్నారు.' అంటూ ట్వీట్ చేశారు. ఇది చూసిన త‌ర్వాతే కెటీఆర్ కాంగ్రెస్ ఖాతాను బ్లాక్ చేసిన‌ట్లు క‌న్పిస్తోంది.

Next Story
Share it