నష్ట నివారణ కోసం వివరణలు
వచ్చే ఏడాదే జీహెచ్ ఎంసి లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఏ పార్టీ కి అయినా జీహెచ్ఎంసి ఎన్నికలు అత్యంత కీలకం అన్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో బిఆర్ఎస్ ఎమ్మెల్యే కౌషిక్ రెడ్డి ఆ పార్టీ ని బుక్ చేశారు. శుక్రవారం నాడు ఎమ్మెల్యే గాంధీని టార్గెట్ చేసుకుని కౌషిక్ రెడ్డి ఆంధ్రా ప్రాంతానికి సంబంధించి చేసిన వ్యాఖ్యలు రాజకీయం గా దుమారం రేపాయి. కొత్తగా పీఏసి చైర్మన్ గా ఎన్నికైన ఎమ్మెల్యే గాంధీ మనుషులు ఎమ్మెల్యే కౌషిక్ రెడ్డి ఇంటిపై దాడి చేయటం అధికార పార్టీ ని ఇరకాటంలోకి నెట్టింది. కౌషిక్ రెడ్డి ఇంట్లో నుంచి బయటకు రాకుండా అడ్డుకున్న పోలీసులు..గాంధీ మాత్రం అనుచరులతో కలిసి ఏకంగా కౌషిక్ రెడ్డి ఇంటి వరకు రావటానికి అనుమతించటంపై విమర్శలు వ్యక్తం అయ్యాయి. ఇది అంతా అధికార కాంగ్రెస్ పార్టీ ఒక పథకం ప్రకారం చేసింది అనే విమర్శలకు ఛాన్స్ ఇచ్చినట్లు అయింది. అయితే తర్వాత కౌషిక్ రెడ్డి నివాసంపై జరిగిన దాడిపై ఫిర్యాదు చేయటానికి సీపీ ఆఫీస్ కు వెళ్లిన సమయంలో ఎమ్మెల్యే కౌషిక్ రెడ్డి వ్యవహరించిన విధానం ఆయన తీరును బహిర్గతం చేయటంతో పాటు బిఆర్ఎస్ ను ఇరకాటంలోకి నెట్టింది.
వ్యవహారం ఏటో వెళుతుంది అని గ్రహించిన మాజీ మంత్రి హరీష్ రావు ..బలవంతంగా పోలీస్ అధికారులకు వేలు చూపిస్తూ మాట్లాడిన కౌషిక్ రెడ్డి ని అక్కడ నుంచి పక్కకు తీసుకెళ్లారు. అంతకు ముందే కౌషిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా వేడి పుట్టించాయి. తాను నిఖార్సు అయిన తెలంగాణ వాదినని..గాంధీ కృష్ణా జిల్లా నుంచి బతకడానికి హైదరాబాద్ వచ్చారు అంటూ చేసిన విమర్శలు బిఆర్ఎస్ ను ఇరకాటంలోకి నెట్టాయి. ఇదే అంశంపై అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బిఆర్ఎస్ పై ఎటాక్ చేస్తూ ఆంధ్రా ప్రాంత ఓట్లు కావాలి ...వాళ్ళ ఓట్లతోనే కదా బిఆర్ఎస్ కు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ లోని అన్ని సీట్లు వచ్చింది అంటూ పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ అంశంపై స్పందించి కెసిఆర్ కుటుంభం దీనిపై వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ తరుణంలో కౌషిక్ రెడ్డి శుక్రవారం నాడు ఈ విషయంపై వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు.
ఇప్పుడు జరుగుతున్నది అరికపూడి గాంధీ, తనకు మధ్య జరుగుతున్న గొడవ మాత్రమే అన్నారు. తాను నిన్న అన్నది గాంధీని మాత్రమే అని...ఆంధ్రా ప్రాంత సెటిలర్లను కాదు అన్నారు. ప్రతి ఆంధ్రా సెటిలర్ అంటే తమకు గౌరవం ఉంది అని తెలిపారు. కెసిఆర్ స్వయంగా గతంలో ఆంధ్రా వాళ్ళ కాలి లో ముళ్ళు గుచ్చుకుంటే ...తాను పంటితో తీస్తాను అన్నారు అని...గత పదేళ్ల పాలనలో ఆంధ్రా ప్రాంత వాళ్ళను అద్భుతంగా చూసుకున్నాం అని...ఒక్క సంఘటన కూడా జరగలేదు అంటూ చెప్పారు. కౌషిక్ రెడ్డి ఈ అంశంపై ఇంత వివరణ ఇచ్చారు అంటే రాజకీయంగా బిఆర్ఎస్ ను బుక్ చేస్తుంది అనే భయంతోనే కౌషిక్ రెడ్డి మాట్లాడినట్లు కనిపిస్తోంది అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ముఖ్యంగా జీహెచ్ ఎంసి ఎన్నికల్లో ఇది తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉండంతో బిఆర్ఎస్ అధిష్టానమే కౌషిక్ రెడ్డి తో క్లారిఫికేషన్ ఇప్పించింది అని..అందుకే ఇది తనకు, గాంధీ కి మధ్య మాత్రమే సాగుతున్న వివాదం అంటూ చెప్పుకొచ్చినట్లు భావిస్తున్నారు.