ప్రభుత్వం బిల్డర్లు...పారిశ్రామిక వేత్తల కోసం పని చేయాలా?

లేకపోతే ప్రభుత్వాలను పడగొడతారా!
ప్రభుత్వం ప్రజల కోసం పని చేయాలా?. లేక రియల్ ఎస్టేట్ సంస్థలు..కార్పొరేట్ కంపెనీల కోసం పని చేయాలా?. అధికారంలో ఉన్న పదేళ్ల కాలంలో బిఆర్ఎస్ పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ సంస్థలకు మేలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంది. అందులో భాగంగానే పలు చోట్ల పెద్ద పెద్ద రహదారులు వేసి బడా బడా కంపెనీల వెంచర్లకు విలువ చేకూర్చి పెట్టినట్లు కూడా విమర్శలు ఉన్నాయి. అదే సమయంలో కార్పొరేట్ కంపెనీలకు పెద్ద ఎత్తున లబ్ది చేకూర్చింది అనే విమర్శలు కూడా లేకపోలేదు. అయితే ఇలా ఎన్నో ఆరోపణలు చేసిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కావస్తున్నా ఈ దిశగా ఎలాంటి చర్యలు లేవు. అయితే బిఆర్ఎస్ కు చెందిన దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్పటికే గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్న బిఆర్ఎస్ ను ఇవి మరింత ఇరకాటంలో...ఆత్మ రక్షణలో పడేశాయి అనే చెప్పాలి. తెలంగాలో కాంగ్రెస్ పాలనపై విసుగు చెందిన బిల్డర్లు, పారిశ్రామికవేత్తలు ఈ ప్రభుత్వాన్ని పడగొట్టాలని కోరుతున్నారు అని..అవసరం అయితే ఎమ్మెల్యేల కొనుగోలుకు తాము డబ్బులు సమకూరుస్తాం అని చెపుతున్నారు అంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద సంచలనంగా మారాయి.
అంటే బిఆర్ఎస్ ప్రజల కోణంలో కాకుండా...కేవలం రియల్టర్లు..పారిశ్రామిక వేత్తల కోణంలో పని చేస్తుంది అని చెప్పినట్లు అయింది. అంతే కాదు...ఏకంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని కూల్చమని బిల్డర్లు, పారిశ్రామిక వేత్తలు కోరటం అంటే ఇది మాములు విషయం కాదు. మరి ఇంతటి సీరియస్ విషయంలో రేవంత్ రెడ్డి సర్కారు ఎలా వ్యవహరిస్తుందో చూడాలి. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ఎమ్మెల్యేల కొనుగోలుకు అవసరం అయిన డబ్బులు కూడా ఇస్తామని వాళ్ళు చెపుతున్నారు అని ఒక ఎమ్మెల్యే బహిరంగంగా ప్రకటించటం అంటే ఇది ఆషామాషీగా తీసుకునే విషయం కాదు. తెలంగాణా రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తో పాటు మరికొంత కాంగ్రెస్ నేతలు కొత్త ప్రభాకర్ రెడ్డి కామెంట్స్ పై పొలిటికల్ గా కౌంటర్ ఇచ్చారు.
మరి ప్రభుత్వ పరంగా ఏమైనా చర్యలు ఉంటాయా లేక ఇప్పటికే వదిలేసిన చాలా విషయాల మాదిరిగానే దీన్ని కూడా వదిలేస్తారా అన్నది భవిష్యత్ లో కానీ తేలదు. కొత్త ప్రభాకర్ రెడ్డి బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ ఆత్మ అని...కెసిఆర్ మాటలే ఆయన చెప్పారు అని మంత్రి పొంగులేటి వ్యాఖ్యానించారు. అధికారంలో ఉన్నపుడు రియల్ ఎస్టేట్ కంపెనీ ల కోసం పని చేసిన బిఆర్ఎస్..ఇప్పుడు భూ భారతి తో దోపిడీ చేసిన భూములు పోతాయని ఉద్దేశంతోనే ఇలాంటి ఆలోచనలు చేస్తున్నారు అని విమర్శించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ ప్రభుత్వం ఎక్కువ కాలం ఉండదు అంటూ బిఆర్ఎస్ నేతలు అధికారికంగానే చెపుతూ వస్తున్నారు. ఇప్పుడు అయితే ఏకంగా ఈ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి బిల్డర్లు. పారిశ్రామికవేత్తలు ఎమ్మెల్యే ల కొనుగోలుకు అవసరం అయిన డబ్బులు ఇస్తామని చెపుతున్నారు అని ప్రకటించటం పెద్ద సంచలనంగా మారింది.