కోమటిరెడ్డి వెంకటరెడ్డి 'డబుల్ గేమ్'..గెలిస్తే అటు..లేకపోతే ఇటే!
గెలిస్తే అటు..లేకపోతే ఇటు అన్న ప్లాన్ లో వెంకటరెడ్డి ఉన్నారని ఓ నేత వ్యాఖ్యానించారు. మునుగోడు సీటును బిజెపి దక్కించుకుంటే ఆ వెంటనే ఎంపీ వెంటకరెడ్డి కూడా బిజెపిలో చేరితే నల్లగొండ జిల్లాలో ఆ పార్టీకి మరింత బలం చేకూరినట్లు అవుతుందన్నది కమలనాధుల ప్లాన్. ఆ ప్లాన్ ప్రకారమే ఇది జరుగుతున్నట్లు కాంగ్రెస్ నేతలు అనుమానిస్తున్నారు. బిజెపి పరాజయం పాలైతే మాత్రం కాంగ్రెస్ లోనే కొనసాగి పరిస్థితులకు అనుగుణంగా కదులుతారని చెబుతున్నారు. కాంగ్రెస్ లో ఉంటూనే ఆ పార్టీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఎంపీ వెంకటరెడ్డి కూడా ఢిల్లీలో బిజెపి అగ్రనేతలతో సన్నిహితంగా మెలుగుతూ వస్తున్నారు. ఈ తరుణంలోనే వీరి కుటుంబానికి చెందిన కంపెనీకి వేల కోట్ల రూపాయల కాంట్రాక్ట్ దక్కటంతో ఒక్కసారిగా రాజకీయ దుమారం రేగిన విషయం తెలిసిందే. ఎవరి ప్లాన్స్ ప్రకారం వాళ్ళు పనిచేసుకుంటూ పార్టీని దెబ్బతీసుకుంటూ పోతుంటే కాంగ్రెస్ అధిష్టానం చూస్తూ కూర్చుంటుందా..సొంత ప్లాన్స్ ఏమైనా అమలు చేస్తుందా అన్నది రాజకీయ తెరపై చూడాల్సిందే.