కెసీఆర్..గజ్వేల్..సిద్ధిపేట..సిరిసిల్లల సీఎం
కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం కెసీఆర్ ది అరాచకపాలన అని విమర్శించారు. హిట్లర్ బతికుంటే కెసీఆర్ ను చూసి విలపించేవారని ఎద్దేవా చేశారు. గజ్వేల్, సిద్ధిపేట, సిరిసిల్లలకు మాత్రమే కెసీఆర్ సీఎంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డితో తనకు ఎలాంటి విభేదాలు లేవని..పార్టీ బలోపేతానికి కలసి పనిచేద్దామని చెప్పినట్లు తెలిపారు. భువనగిరి పార్లమెంట్ స్థానంలో రోడ్లు, పెండింగ్ సమస్యలు పరిష్కరిస్తే ఎమ్మెల్యే, ఎంపీ పదవులకు రాజీనామా చేస్తామని.. వచ్చే ఎన్నికల్లో పోటీ కూడా చేయమని, కావాలంటే బాండ్ రాసి ఇస్తామని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. చౌటుప్పల్ మండలంలో కాంగ్రెస్ సర్వ సభ్య సమావేశంలో ఎంపీ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో వివిధ పనులకు సంబంధించి.. కాంట్రాక్టర్లకు రూ.1,350 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని అన్నారు. దీంతో కొంతమంది కాంట్రాక్టర్లు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి సంబంధించిన పనులు అంటేనే.. ఎవరూ ముందుకు రావడం లేదని ఆయన విమర్శించారు. మూసి ప్రక్షాళన కోసం పార్లమెంట్‌లో మాట్లాడతానని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రతిపక్ష ఎమ్మెల్యే, ఎంపీలకు ప్రొటోకాల్ కూడా ఇవ్వడం లేదన్నారు. దళితులకు క్యాబినెట్‌లో స్థానం లేదని.. దళిత బంధు పేరుతో మోసం చేయడం సీఎం కేసీఆర్‌కు బాగా తెలుసని చెప్పారు. ఎంపీ స్థానంలో ఉంటూ.. రెండేళ్ల నుంచి అపాయింట్‌మెంట్ అడిగితే ఇంతవరకు దిక్కేలేదని కోమటిరెడ్డి విమర్శించారు.