పార్టీ మార్పు ప్రచారంపై కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు
తెలంగాణ కాంగ్రెస్ లో నిత్యం ఏదో ఒక అలజడి. ఒక సారి జగ్గారెడ్డి, మరో సారి కోమటిరెడ్డి రాజగోపాల రెడ్డి, మధ్య మధ్యలో విహెచ్. ఇలా నేతలు అందరూ పార్టీపై వ్యాఖ్యలు చేస్తూ హాట్ టాపిక్ గా మారుతున్నారు. గౌరవం లేని చోట తాను ఉండలేనంటూ ఇటీవల ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క తనకు అండగా నిలబడకపోగా..తాను మాట్లాడిన మాటలు తప్పు అనేలా సభలో వ్యాఖ్యానించటాన్ని రాజగోపాల్ రెడ్డి బహిరంగంగానే తప్పుపట్టారు. అయితే రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలతో తనకు ఏ మాత్రం సంబంధం లేదన్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. తాను చివరి వరకు కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. కోమటిరెడ్డి మంగళవారం నాడు ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్‌లో ఉన్న అంతర్గత విభేదాలు మొగుడు పెళ్లాల మధ్య ఉన్న గొడవ లాంటివేనన్నారు. అన్ని అంశాలు సర్దుకుంటాయని ఆ ఆశాభావం వ్యక్తం చేశారు. తాను ప్రధానిని కలిసినంత మాత్రాన పార్టీ మారతాను అనడానికి సంకేతం కాదన్నారు. తాను చివరి వరకు కాంగ్రెస్‌లోనే కొనసాగుతానన్నారు. సీఎం కేసీఆర్ అవినీతిపై ఫిర్యాదు చేసేందుకే ప్రధానిని కలిశానని, భవిష్యత్తులోను ప్రధానిని కలుస్తానని తెలిపారు.
సరైన సమయంలో రైతుల పంటలను కొనుగోలు చేసి రైతులకు బోనస్ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. కోవిడ్ నేపథ్యంలో ఎకరానికి పదివేల పెట్టుబడి పెరిగిందన్నారు. బోనస్ ఇచ్చి రైతులను ఆదుకోవాలన్నారు. ధాన్యం కొనుగోలు చేతకాకపోతే కేసీఆర్ తప్పుకోవాలన్నారు. కేసీఆర్‌కు ధాన్యం కొనుగోలు చేయడం చేతగాకపోతే తనకు, రేవంత్ రెడ్డికి అప్పచెబితే మద్ధతు ధరతో కొనుగోలు చేసి చూపిస్తామని ఆయన సవాల్ విసిరారు. కేసీఆర్‌కి తన అభివృద్ధి మాత్రమే ముఖ్యమని ఆయన ఆరోపించారు. మూడు వేల కోట్ల రూపాయలు కేటాయించి మూసీ ప్రక్షాళన చేయాలని ప్రధానిని కోరానని ఆయన తెలిపారు. తెలంగాణలో వరిధాన్యానికి మద్దతు ధర పెంచాలని కేసీఆర్‌ను ఆయన డిమాండ్ చేశారు. చత్తీస్‌ఘడ్‌లో తమ కాంగ్రెస్ ప్రభుత్వం వరి ధాన్యానికి 500 బోనస్ ఇస్తుందని ఆయన పేర్కొన్నారు. రైతు బంధు పథకం వల్ల రైతులకు పూర్తి స్థాయిలో న్యాయం జరగదన్నారు. ప్రగతి భవన్‌లో విభేదాల గురించి మీడియా రాయదన్నారు. కాంగ్రెస్‌కు సొంత మీడియా, డబ్బులు లేవు కాబట్టే వ్యతిరేకంగా రాస్తారని ఆయన విమర్శించారు. అభివృద్ధి పనుల కోసం ప్రధానిని, కేంద్ర మంత్రులను గతంలో కలిశాను, భవిష్యత్తులో కూడా కలుస్తాననని ఆయన స్పష్టం చేశారు.