తెలంగాణలో కాంగ్రెస్ మార్క్ రాజకీయం మొదలైందా?!
రేవంత్ రెడ్డే పదేళ్లు సీఎం గా ఉంటారు. కొద్ది రోజుల క్రితం ఆయన క్యాబినెట్ లో మంత్రిగా ఉన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన ప్రకటన ఇది. ఒకప్పుడు రేవంత్ రెడ్డి పై విమర్శలు గుప్పించిన వెంకట్ రెడ్డి కారణాలు ఏమైనా కూడా తర్వాత తర్వాత సీఎం రేవంత్ రెడ్డి కి మద్దతుగా నిలబడుతూ వస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీ లో ముఖ్యమంత్రి పదవికి అర్హుడు అయిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాత్రమే అంటూ ఏప్రిల్ లో సంచలన వ్యాఖ్యలు చేశారు. అప్పటిలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. ఒక వైపు రేవంత్ రెడ్డి బహిరంగంగా కాంగ్రెస్ లో సీఎం అయ్యే అర్హతలు ఉన్న వ్యక్తి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అని చెపుతుంటే...ఆయన సోదరుడు..ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాత్రం ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఎం అవుతారు అని వ్యాఖ్యానించారు. ఇప్పుడు కాకపోయినా భవిష్యత్ లో ఆయనకు సీఎం పదవి వస్తుంది అని..తన నాలుకపై నల్ల మచ్చలు ఉన్నాయి అని..తాను ఏమి చెపితే అదే జరుగుతుంది అంటూ వ్యాఖ్యానించారు.
అంతకు ముందు ఆయన శుక్రవారం నాడు జరిగిన ఒక కార్యక్రమంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ని సీఎం గా సంబోధించారు. ఒక వైపు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పదేళ్లు సీఎం గా రేవంత్ రెడ్డే ఉంటారు అని చెపుతుంటే ఆయన సోదరుడు రాజగోపాల్ రెడ్డి మాత్రం ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారు అని చెప్పటం అంటే ఏమిటి?. దీని వెనక ఉన్న కారణాలు ఏమై ఉంటాయి అన్న చర్చ కాంగ్రెస్ వర్గాల్లో సాగుతోంది. రేవంత్ రెడ్డి క్యాబినెట్ లో తనకు బెర్త్ దక్కుతుంది అనే ధీమాతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాలు చెపుతున్నాయి. దీనికి ప్రధాన కారణం బీజేపీ నుంచి కాంగ్రెస్ లో చేరిన సమయంలో తనకు హామీ ఇచ్చినట్లు ఆయన చెపుతున్నారు. కానీ క్యాబినెట్ విస్తరణ ఎప్పుడు అన్న విషయం మాత్రం స్పష్టత రావటం లేదు. ఈ తరుణంలో రాజగోపాల్ రెడ్డి కావాలనే రేవంత్ రెడ్డి ని టార్గెట్ చేసి..ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారు అనే మాటలు అన్నారా...లేక దీని వెనక ఏమైనా ఇతర కారణాలు ఉన్నాయా అన్న చర్చ సాగుతోంది.
ఎన్నికల ఫలితాల అనంతరం తాను కచ్చితంగా సీఎం రేస్ లో ఉన్నట్లు అప్పటిలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీ లో బహిరంగంగా కూడా ప్రకటించారు. కానీ అధిష్ఠానం మాత్రం రేవంత్ రెడ్డి వైపే మొగ్గుచూపిన విషయం తెలిసిందే. తెలంగాణ లో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుతీరిన తర్వాత గత కాంగ్రెస్ ప్రభుత్వ తరహా ప్రకటనలు పెద్దగా లేవు అనే చెప్పాలి. కానీ తాజాగా రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో తెలంగాణ మళ్ళీ కాంగ్రెస్ మార్క్ రాజకీయం మొదలైందా అన్న చర్చ తెరమీదకు వస్తోంది. తెలంగాణలో కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది కూడా కాకముందే మళ్ళీ ముఖ్యమంత్రుల చర్చలు తెరమీదకు రావటం అటు కాంగ్రెస్ నేతలను..ఇటు శ్రేణులను గందరగోళంలోకి నెడతాయి అని చెపుతున్నారు. మరో వైపు ఎన్నో తప్పు చేసిన బిఆర్ఎస్ ఒక వైపు అధికార కాంగ్రెస్ పై ఒక రేంజ్ లో ఎటాక్ చేస్తుంటే...దాన్ని ఎదుర్కోవడంలో అధికార కాంగ్రెస్ విఫలం అవుతుంది అనే చర్చ పార్టీ నాయకుల్లో ఉంది. ఈ తరుణంలో రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఎటు దారితీస్తాయో చూడాలి.