Telugu Gateway
Telangana

పార్టీకి వెయ్యి కోట్ల ఆస్తి..మ‌రి మీ ఫ్యామిలీ ఆస్తులు ఎంత‌?

పార్టీకి వెయ్యి కోట్ల ఆస్తి..మ‌రి మీ ఫ్యామిలీ ఆస్తులు ఎంత‌?
X

తెలంగాణ బిజెపి ప్రెసిడెంట్ బండి సంజ‌య్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. టీఆర్ఎస్ అధినేత, సీఎం కెసీఆర్ పార్టీ ప్లీన‌రీలో చెప్పిన టీఆర్ఎస్ ఆస్తుల అంశంపై స్పందించారు. టీఆర్ఎస్ పార్టీకి వెయ్యి కోట్ల రూపాయ‌ల ఆస్తులు ఉన్నాయ‌ని చెప్పారు బాగుంది కానీ..మీ ఫ్యామిలీ ఆస్తులు కూడా ఎన్నో చెపితే బాగుండేద‌ని అన్నారు. రాష్ట్రాన్ని సీఎం దోచుకుతింటున్నడు అని ఆరోపించారు. 36 వేల కోట్లతో పూర్తయ్యే కాళేశ్వరం ప్రాజెక్టును లక్షా 20 వేల కోట్లకు పెంచేసిండు అన్నారు. పాల‌మూరు ప్రాజెక్టులోనూ ఇదే తీరు సాగింద‌న్నారు. ఈ రెండింట్లో కొన్ని వేల కోట్ల రూపాయల కమీషన్లు దొబ్బి వేల కోట్లు సంపాదించిన కేసీఆర్ కుటుంబం రాష్ట్రాన్ని అథో:గతి పాల్జేసిండు. రైతులకు మాత్రం చుక్క నీరివ్వలే అంటూ వ్యాఖ్యానించారు. వేల కోట్లు దోచుకున్న ఘనుడు కేసీఆర్... ఆయన కేంద్రమంత్రి గా ఉన్నప్పుడే సహారా, ఈఎస్ఐ స్కాంలలో ఇరుక్కుని సీబీఐ విచారణ ఎదుర్కొన్న విషయం వాస్తవం కాదా? ఆనాడు కేసీఆర్ ను మంత్రివర్గం నుండి తొలగించాలని భావిస్తే... ప్రభుత్వం నుండి బయటకు వచ్చి కథలు చెప్పిన వాస్తవం కాదా? నీ కేబినెట్ మంత్రులపై అనేక అవినీతి ఆరోపణలున్నయ్. కోర్టుల్లో విచారణ జరుగుతోంది వాస్తవం కాదా? అని ప్ర‌శ్నించారు. సాధారణంగా ఏ రాజకీయ పార్టీ అయినా ప్రాంతీయ పార్టీ లేదా జాతీయ పార్టీ అయినా వాటికి సంబంధించిన వార్షికోత్సవాలు, ప్లీనరీలు జరుపుకోవడం సహజం. దీనిపై ఎవరికీ అభ్యంతరం ఉండదు. ప్లీనరీలో పార్టీ సంస్థాగత విషయాలపై చర్చించుకుంటయ్. ప్రజలకు మనమేం ఏం చేసినం. ఏం సాధించినం.. ఎన్ని హామీలు నెరవేర్చినం.. మిగిలిన హామీలు ఎట్లా నెరవేర్చాలి... ప్రజల కోసం ఇంకా ఏం చేయాలనే దానిపై చర్చించుకుంటాయి. కార్యకర్తల, నేతల అబిప్రాయాలు తెలుసుకోవాలి. కానీ ప్లీనరీలో ఇవేమీ చర్చించలేదు. దీనినిబట్టి టీఆర్ఎస్ సాధించిందేమిలేదని అర్థమైంది.

మొదటి ప్రజా సంగ్రామ యాత్రను తక్కువ అంచనా వేసిండు. సక్సెస్ అయ్యే సరికి భయం పట్టుకుంది. రెండో విడత యాత్రలో వస్తున్న ప్రజా స్పందనను చూసిన తరువాత వణుకుపుట్టి ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నరు. మాకు సంస్కారం ఉంది కాబట్టి బూతులు తిట్టడం లేదు.యాత్రను చూస్తే ఎంత భయపడుతున్నరో వాళ్ల ఆక్రోశమే చెబుతోంది. అలంపూర్ నుండి ఉట్కూర్ దాకా వస్తున్న జనం... ర్యాలీలుగా సాగుతున్న వైనం.. సభలకు వస్తున్న స్పందన మీడియాసహా అంతా చూస్తున్నరు. ప్లీనరీ విషయానికొస్తే... నిన్న జరిగిన టీఆర్ఎస్ ప్లీనరీ యావత్తు కేంద్రంపైన, నరేంద్రమోదీని తిట్టడానికే ప్రాధాన్యమిచ్చారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ లో ఏదో పొడిచిండట... ఇగ దేశానికి దిశా నిర్దేశం చేస్తడట. తెలంగాణ ధనిక రాష్ట్రమని కేసీఆరే చెప్పిండు. అట్లాంటిది రాష్ట్రాన్ని 4 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి ఒక్కో తలకాయపై లక్ష అప్పు ఎందుకు మోపినవ్. ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితి ఎందుకు వచ్చింది. ఒక్కో జిల్లాకు ఒక్కో తేదీన జీతాలేసే పరిస్థితి వచ్చింది? పెన్షనర్లకు బెన్ ఫిట్స్ కూడా ఇవ్వడం లేదంటే తెలంగాణలో ఆర్దిక పరిస్థితి ఏ విధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. దీంతోపాటు విద్యుత్ ఛార్జీలు పెంచారు. వచ్చే నెల నుండి కరెంట్ బిల్లులు చూస్తే షాక్ కొట్టి గుండెపోటు వచ్చేలా చేస్తున్నరు. రూ.70 వేల కోట్ల డిస్కంలకు బకాయిలు పెట్టారు. ఆర్టీసీ ఛార్జీలు పెంచి జనంపై భారం మోపుతున్నరు అంటూ విమ‌ర్శ‌లు గుప్పించారు.

Next Story
Share it