Telugu Gateway
Telangana

బిఆర్ఎస్ లో కవిత కలకలం !

బిఆర్ఎస్ లో కవిత కలకలం !
X

బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ అధికారంలో ఉన్నప్పుడు అసెంబ్లీ లో...బయట కూడా పదే పదే ఒక మాట చెప్పేవారు. తప్పు చేస్తే కొడుకుపై అయినా ...కూతురి పై అయినా సరే చర్యలు ఉంటాయని. ఇందులో వాళ్లకు కూడా ఎలాంటి మినహాయింపులు ఉండవని ప్రకటించేవాళ్ళు. కానీ ఇప్పుడు పార్టీలో తప్పు జరుగుతోంది...అధికారంలో ఉన్నప్పుడు అవినీతికి కారణం వీళ్ళు అని చెప్పిన కూతురు, ఎమ్మెల్సీ కవితను బిఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేశారు. దేశ వ్యాప్తంగా దుమారం రేపిన లిక్కర్ స్కాం లో కవిత పై ఆరోపణలు వచ్చినప్పుడు..ఆమె అరెస్ట్ అయినప్పుడు కానీ ఆమె ను సస్పెండ్ చేయని బిఆర్ఎస్.. ఇప్పుడు కాళేశ్వరం లో అవినీతి ఎవరు చేశారో చెపితే సస్పెండ్ చేయటం రాబోయే రోజుల్లో పార్టీ ని ఇరకాటంలోకి నెట్టే అవకాశం ఉంది. అదే సమయంలో కవితే ఇప్పుడే ఈ విషయాలు అన్నీ ఎందుకు చెపుతున్నారు అనే ప్రశ్నలు కూడా తెర మీదకు వస్తాయి.

బిఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీ కవిత ను సస్పెండ్ చేశారు. ఈ మేరకు ఆ పార్టీ అధిష్ఠానం మంగళవారం నాడు అధికారికంగా ఒక ప్రకటన విడుదల చేసింది. గత కొంత కాలంగా ఎమ్మెల్సీ కవిత పార్టీ నాయకత్వంపై తీవ్ర విమర్శలు చేస్తూ వస్తున్న విషయం తెలిసిందే. కవిత కెసిఆర్ కు రాసిన లేఖ బయటకు రావటంతో ఆమె దీనిపై సీరియస్ గా స్పందిస్తూ కెసిఆర్ పక్కన కొన్ని దెయ్యాలు ఉన్నాయని సంచలన ఆరోపణలు చేశారు. ఇది అప్పటిలో పెద్ద కలకలం రేపింది. తాజాగా తెలంగాణ సర్కారు కాళేశ్వరం స్కాం పై విచారణ బాధ్యతను సిబిఐ కి అప్పగిస్తూ నిర్ణయం తీసుకోవటంతో కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. కెసిఆర్ కు అవినీతి మరక అంతటానికి ప్రధాన కారణం హరీష్ రావు ...సంతోష్ రావు, మేఘా కృష్ణారెడ్డి లే అని ఆరోపించారు. అందుకే రెండవ సారి అధికారంలోకి వచ్చిన తర్వాత హరీష్ రావు కు సాగునీటి శాఖ ఇవ్వలేదు అని కూడా చెప్పుకొచ్చారు. ఇది బిఆర్ఎస్ పార్టీ ని రాజకీయంగా పెద్ద ఇరకాటంలో పడేసింది. కవిత ప్రకటన తర్వాత కెసిఆర్ పలు మార్లు పార్టీ నేతలతో సమావేశం అయి చర్చించారు. ఇప్పుడు ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.

ఈ ప్రకటన సారాంశం ఇలా ఉంది. ‘పార్టీ ఎమ్మెల్సీ కవిత ఇటీవల కాలంలో ప్రవర్తిస్తున్న తీరుతెన్నులు, కొనసాగిస్తున్న పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు బిఆర్ఎస్ పార్టీ కి నష్టం కలిగించే రీతిలో ఉన్నందున పార్టీ అధిష్ఠానం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తోంది. పార్టీ అధ్యక్షులు కె. చంద్ర శేఖర్ రావు పార్టీ నుంచి తక్షణం కవితను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు’ అని పార్టీ జనరల్ సెక్రటరీలు సోమా భరత్, టి. రవీందర్ రావు ల పేరుతో ప్రకటన వెలువడింది. అయితే ఇంత వరకు పార్టీ నాయకులు ఎవరూ ఆమె చేసిన అవినీతి ఆరోపణలకు కౌంటర్ ఇవ్వకపోవటం పార్టీ చర్చనీయాంశంగా మారింది.

Next Story
Share it