కెసీఆర్...ఓ సారి ఇటు చూడు
'తెలంగాణలో వ్యవసాయం బ్రహ్మండంగా ఉందని ముఖ్యమంత్రి కెసీఆర్ చెబుతున్నారని ...కేసీఆర్ ఓ సారి ఇటు చూడు రైతుల దీనస్థితి ఏమిటో తెలుస్తుంది.అధికారులను పంపించి రైతులను ఆదుకో.' అంటూ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజిగిరీ ఎంపీ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. పాదయాత్ర చేస్తున్న రేవంత్ రెడ్డి సోమవారం నాడు గిట్టుబాటు ధర రాక పొలంలోనే వదిలేసిన టమాటా పంటను పరిశీలించి..పొలంలో మహిళ రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా పంట అమ్మితే కనీసం పెట్టుబడులు,కూలీ, రవాణా ఛార్జీలు కూడా రావడం లేదంటూ రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మాటలకు క్షేత్రస్థాయిలో పరిస్థితికి పొంతన లేదన్నారు. కార్పొరేట్ కంపెనీల ఒత్తిడితోనే రైతు ఉద్యమంపై మోడీ ఉక్కుపాదం మోపుతున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు. మోడీ వ్యవసాయ చట్టాలను రద్దు చేయక పోతే రైతులు ఆయన్ను గద్దె దించుతారన్నారు.
మంగళవారం నాటి రాజీవ్ రైతు భరోసా రణ భేరి బహిరంగ సభలో రైతు ఉద్యమంపై మా కార్యచరణ ప్రకటిస్తామని తెలిపారు రేవంత్ రెడ్డి. కేసీఆర్ వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించాలని డిమాండ్ చేశారు. అంతే కాకుండా వ్యవసాయ చట్టాలను తెలంగాణలో అమలు చేయబోమని ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర రేపటితో ముగియనుంది. ఈ సందర్భంగా బహిరంగ సభ ఏర్పాటు చేశారు. అయితే కాంగ్రెస్ లో నెలకొన్న విభేదాల కారణంగా ఈ సభకు ఎవరెవరు హాజరు అవుతారన్నది ఆసక్తికరంగా మారింది.