కెటిఆర్..హరీష్ లు కెసిఆర్ నిర్ణయాన్ని తప్పుపడుతున్నారా ?!

‘ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయానికి మనస్ఫూర్తిగా మద్దతు ఇస్తున్నా. ఇది దేశ ప్రయోజనాల కోసం తీసుకున్న నిర్ణయం. నల్ల ధనం నిరోధానికి, దొంగ నోట్ల కు అడ్డుకట్ట వేయటానికి. రాజకీయ అవినీతి నిరోధానికి, ఉగ్రవాదాన్ని రూపుమాపడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది నగదు రహిత లావాదేవీలకు రాష్ట్రం మద్దతు ఇస్తుంది’ అంటూ అసెంబ్లీ వేదికగా బిఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ చేసిన ప్రకటన ఇది . దేశ ప్రజలు నోట్ల రద్దు కారణంగా తీవ్ర ఇక్కట్లు ఏడుకొంటున్న సమయంలో అయన చెప్పిన మాటలు ఇవి. ఇవి చూస్తే అటు ప్రధాని మోడీ..కేంద్రం ఏమి చెప్పిందో కెసిఆర్ కూడా వాటినే స్పష్టంగా చెప్పేశారు. సీన్ కట్ చేస్తే కేంద్రం చెప్పిన లక్ష్యాల్లో ఏమీ కూడా నేరవేరినట్లు ఎక్కడా కనిపించటం లేదు. మరి దేశానికీ ఒక దిశా, దశ చూపిస్తాను...భారత్ ను అమెరికా, చైనా లను దాటేలా చేస్తాను అని చెపుతున్న కెసిఆర్ ఎలాంటి స్టడీ చేయకుండా....నిపుణుల నుంచి ఎలాంటి సమాచారం తీసుకోకుండానే మోడీ చెప్పిన మాటలనే కెసిఆర్ కూడా అసెంబ్లీ లో చెప్పారు. అంటే దీనిపై ఎలాంటి కసరత్తు చేయలేదు అని స్పష్టం అవుతోంది. పార్టీ పరంగా...ప్రభుత్వ పరంగా కెసిఆర్ నోట్ల రద్దుకు మద్దతు ఇచ్చి...అప్పుడు అలా అనుకున్నాం...ఇలా అవుతుంది అని అనుకోలేదు అంటే సరిపోతుందా.
ఏదో ఒక సాదా సీదా రాజకీయ నాయకుడిలా దీన్ని సమర్ధించుకోగలరా?. కెసిఆర్ అసెంబ్లీ సాక్షిగా అలా చెపితే ఇప్పుడు మాత్రం తెలంగాణ మంత్రులు కెటిఆర్ , హరీష్ రావు లు దీన్ని తప్పు పడుతున్నారు. మంత్రి కెటిఆర్ నోట్ల రద్దు తెలివి తక్కువ నిర్ణయం అంటే..నోట్ల రద్దు అట్టర్ ప్లాప్ షో అని మరో మంత్రి హరీష్ రావు స్పందించారు. మరి వీటికి మద్దతు ఇచ్చిన కెసిఆర్ నిర్ణయాన్ని వీళ్లిద్దరు ఏమంటారో. నోట్ల రద్దు తర్వాత కూడా నగదు చలామణి అడ్డగోలుగా పెరిగింది. ఆర్ బీఐ లెక్కలే ఈ విషయం చెపుతున్నాయి. కేంద్రం పార్లమెంట్ వేదికగా చెప్పిన లెక్కలపై తెలంగాణ మంత్రులు ఇద్దరూ మాట్లాడారు. నోట్ల రద్దు సమయంలో మోడీ తో ఎలాంటి విభేదాలు లేకపోవటంతో అయన తీసుకున్న నిర్ణయాన్ని పూర్తిగా మద్దతు ఇచ్చారు. ఇప్పుడు మాత్రం లెక్క తేడా వచ్చే వరకు రివర్స్ గేర్ వేశారు. నోట్ల రద్దు సమయంలో తెలంగాణ ప్రజలు కూడా తీవ్ర ఇక్కట్ల పాలు అయ్యారు. ఆ సమయంలో కెసిఆర్ కేంద్రానికి అండగా నిలబడ్డారు. అప్పట్లోనే కాంగ్రెస్ తో పాటు మరికొంత మంది నోట్ల రద్దు కు సరైన ముందస్తు కసరత్తు లేకుండా చేసి ప్రజలను ఇబ్బందులకు గురిచేశారు అని విమర్శలు చేశాయి. ముఖ్యంగా నోట్ల రద్దు దెబ్బకు చిన్న వ్యాపారాలు, సంస్థలు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయాయి.